. సాలూర చెక్ పోస్టు భూముల్లో ఇష్టారాజ్యం
. సర్వే నంబర్ చెప్పరు.. విస్తీర్ణం ఎంతో వివరించరు..
బోధన్, బతుకమ్మ: బోధన్ నియోజకవర్గంలోని సాలూర అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ పరిధిలోని భూమిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి వేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. చెట్లు నరకేందుకు అనుమతులు ఇచ్చిందెవరు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా చెక్ పోస్ట్ అధికారులు, అటవీశాఖ అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు చెక్ పోస్ట్ పరిధిలోని భూమిని కబ్జా చేసింది ఎవరు అని అంటున్నారు. ఈ తతంగం వెనుక బడా బాబుల హస్తం ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘అధికారం ఉన్న వారిదే రాజ్యం’ అన్న చందంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కబ్జాకోరుల నుంచి ప్రభుత్వ స్థలాన్ని కాపాడి.. వాస్తవాలను వెలికి తీస్తామని శపథాలు చేసిన నాయకులు ఏమయ్యోరో తెలియని పరిస్థితి. ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వేలో చెక్ పోస్ట్ పరిధిలోని ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతారా? ఆ భూమి సర్వే నంబర్ ఎంత? ఎన్ని ఎకరాల విస్తీర్ణం ఉంది? కబ్జా కోరుల నుంచి ఆక్రమణు గురైన భూమిని స్వాధీనం చేసుకుంటారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెక్ పోస్ట్ భవనం పరిధిలో ఉన్న ఫర్నిచర్, జనరేటర్లు, వీధి స్తంభాలు ఏమయ్యాయో తెలీదు. తప్పించుకునే క్రమంలో కబ్జాదారులు నామ మాత్రంగా గుడి నిర్మాణం చేపట్టి ఓ కుల సంఘానికి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పినట్లు వినికిడి. విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సైతం కబ్జాదారులతో చేతులు కలిపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెక్ పోస్టు విధుల్లో ప్రతి రోజూ కానిస్టేబుళ్లు, ప్రైవేట్ అధికారులు మాత్రమే దర్శనమిస్తున్నారు. ఉన్నతాధికారుల జాడ కూడా కనిపించడం లేదు. కబ్జాదారులకు ఓ మండల అధికారి సహకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సబ్ కలెక్టర్ స్పందించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కబ్జాదారులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని, చెక్ పోస్ట్ పరిధిలోని ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.