నిజామాబాద్, బతుకమ్మ: పసుపు రైతులు, విద్యాలయాలు.. ఆరోపణలు, ప్రత్యారోపణల చుట్టూ తిరుగుతున్న ఇందూరు రాజకీయాల్లో అసలే జరగబోతోందనేది చర్చనీయాంశమవుతోంది. పట్టభద్రులు, టీచర్ల వరకే పరిమితమైన ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగా, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఊసేలేదు. అయినా ప్రతి అంశం రాజకీయమవుతోంది.. అనే కన్నా చేస్తున్నారంటేనే సబబు. స్థానిక ఎన్నికలొస్తే తమ సత్తా చూపుతామని బీజేపీ కాలు దువ్వుతుండగా, సంక్షేమ పథకాలు, ఉద్యోగాలే తమకు అండగా నిలుస్తాయని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది. ఇదిలా ఉండగా, కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని.. తెలంగాణ ఆత్మ పార్టీ బీఆర్ఎస్ అని, ప్రజల నాడి తెలిసిన తామే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.

- విద్యాలయాలు – వివాదాలు
కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన నవోదయ విద్యాలయం ఏర్పాటు చేసే స్థల ఎంపిక అంశం వివాదాస్పదమైంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జక్రాన్ పల్లిలో, ఎంపీ అర్వింద్ అదే మండలంలోని కలిగోట్ లో స్థలాలను ప్రతిపాదించగా, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ లోని ఎన్ఎస్ఎఫ్ స్థలాన్ని సూచించారు. ఇక్కడి నుంచే వివాదం రాజుకుంది. ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదన చేసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నవోదయ ఏర్పాటును ఆలస్యం చేశారని, ఆయన రాజకీయాల కారణంగా జిల్లా వెనుబడిపోతోందని అర్వింద్ వ్యక్తిగతంగా విమర్శలకు దిగి దుమ్మెత్తిపోశారు. రూరల్ నియోజకవర్గానికి కేంద్రం ఇచ్చిన నవోదయ, ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఎయిర్ పోర్టును స్థానిక ఎమ్మెల్యే సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. అర్వింద్ విమర్శలపై ఆలస్యంగా స్పందించి ఎమ్మెల్యే భూపతిరెడ్డి.. కలిగోట్ లోని స్థలం నవోదయ ఏర్పాటుకు అనుకూలంగా లేదని సంబంధిత అధికారులే చెప్పారని, జక్రాన్ పల్లిలో నవోదయ ఏర్పాటవుతుందని ప్రకటించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడినట్లు ప్రకటించారు. ఈ మొత్తం నవోదయ ఎపిసోడ్ లో సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాత్రం నోరువిప్పలేదు.
ఈ తరుణంలోనే తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు చర్చ తెరపైకి వచ్చింది. దీనిపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పేరుమారిస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. ఇదిలా ఉండగా.. అబ్బే అలాంటిదేమీ లేదని, తాను సీఎంతో మాట్లాడానని ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రకటించారు. యూనివర్సిటీ పేరు మార్పు ఉండదని సీఎం రేవంత్ విద్యాశాఖ సెక్రెటరీకి స్పష్టంగా తెలిపారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఈ వివాదంలోకి దిగకముందే భూపతిరెడ్డి తెరదించినట్లైంది.

- పసుపు బోర్డు – ధర
పసుపు బోర్డును ప్రకటించిన కేంద్రం జిల్లాకు చెందిన నాయకుడిని చైర్మన్ ను చేసిన విషయం తెలిసిందే. మరోవైపు జిల్లాలో పసుపు రైతులు ధర కోసం ఇటీవల రోడ్డెక్కారు. ఇదే మంచి అవకాశంగా భావించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు.. అసలు బోర్డు ఎక్కడుంది..? ఉంటే రైతులకు ఈ పరిస్థితి ఇంకా ఎందుకుంది..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బోర్డు ఎక్కడుంది..? విధివిధానాలు ఏమిటో తెలుపాలని నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి.. బోర్డు తీసుకువచ్చానంటున్న ఎంపీ అర్వింద్ పసుపు రైతుల ముందుకు వచ్చి ధరపై మాట్లాడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, పసుపునకు గిట్టుబాటు ధర లేని సమయంలో రాష్ర్ట ప్రభుత్వం లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్ స్కీము ద్వారా రైతులను ఆదుకుంటుందని బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ప్రకటించారు.
- బీజేపీ – ఎంఐఎం
మున్సిపల్ ఎన్నికలపై నజర్ వేసిన బీజేపీ.. తమకు పోటీ ఎంఐఎం మాత్రమేనని ప్రకటిస్తోంది. నిజామాబాద్ నగర కార్పొరేషన్ తోపాటు బోధన్ , ఆర్మూర్ లో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతోంది. మరో వైపు గత ఎన్నికల్లో నిజామాబాద్ నగరంలో సత్తాచాటిన ఎంఐఎం మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతోంది. బోధన్ లోనూ తామేంటో చూపుతామని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
