Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 October 2025, 11:08 pm Posted by : ramakrishna

9ఏళ్ళుగా హెచ్ డీఎస్ జాడ ఏది..?

  • జీజీహెచ్ ను పట్టించుకోని పాలకులు
  • అధికారుల కనుసన్నుల్లోనే పనులు
  • అటకెక్కిన జవాబుదారితనం

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిపై పాలకులు చిన్నచూపు చూస్తున్నారు. ఏడంతస్తుల మేడలో 750 పడకలతో నిత్యం 2 వేల వరకు ఓపీ కలిగిన ఆసుపత్రి పాలన వ్యవహరాలంటే ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం పట్టింపు లేదు. దాదాపు దశాబ్ధ కాలంగా మెడికల్ కళాశాల అనుబంధ జిల్లా జనరల్ ఆసుపత్రిలో పాలకమండలి సమావేశాలు జరుగలేదు. ఎలాంటి పనులు అయినా జిల్లా కలెక్టర్, ఆసుపత్రి అధికారులు మాత్రమే సమావేశాలు లేకుండానే పనులను చేపడుతున్నారు. 2016 నుంచి 2025 వరకు  హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటీ (హెచ్ డీఎస్) సమావేశం జరుగలేదని అధికారులే చెబుతున్నారు. ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి 2020 నుంచి 2022 వరకు అతలాకుతలం చేసినా ఆసుపత్రి బాగోగులు పట్టించుకున్న నాథుడే లేడు. ప్రభుత్వాలు మారినా ప్రజాప్రతినిధులు మారినా ఆసుపత్రి అంటేనే నిర్లక్ష్యం కనబడుతుంది. కోట్ల రూపాయలు వెచ్చించిన సర్వజన ఆసుపత్రి గురించి పాలకులకు పట్టింపు లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా పరిస్థితి మారింది.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధంగా జనరల్ ఆసుపత్రిని నిర్మించారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి స్థానంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి ఒకప్పటి ఖలీల్ వాడి (డీఎస్ఏ) గ్రౌండ్ లో జనరల్ ఆసుపత్రిని నిర్మించారు. 2012 కాలంలోనే మెడికల్ కళాశాల ప్రారంభంతో పాటు జనరల్ ఆసుపత్రిని ప్రజలకు అంకితం చేశారు. తెలంగాణ ఏర్పాటు జరిగే వరకు పాత జిల్లా జనరల్ ఆసుపత్రి పాలకవర్గం హెచ్ డీఎస్ సమావేశాలను నిర్వహించింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2016 వరకు హెచ్ డీఎస్ సమావేశాలు జరిగినట్లు రికార్డులున్నాయి. తర్వాత 9 ఏళ్ళుగా హెచ్ డీఎస్ అంటే పట్టించుకున్నట్లు దాఖలాలు లేవు. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్లు జిల్లా జనరల్ ఆసుపత్రి పాలకమండలికి చైర్మన్ గా వ్యవహరించేవారు. గత ప్రభుత్వ హయంలోనూ అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ హెచ్ డీఎస్ చైర్మన్ గా ఉన్నట్లు ప్రచారం జరిగినా సమావేశం జరిపిన దాఖలాలు మాత్రం లేవు. ఎందుకంటే ఆనాడు ఎమ్మెల్యేలు, ఎంపీలు తామే సుప్రీంగా వ్యవహరించడంతో సమావేశాలు అటకెక్కించారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వంలోనైనా హెచ్ డీఎస్ పాలకవర్గ నియామకం జరిగినట్లుగానే సమావేశాలు నిర్వహించినట్లు తెలియదని ఆసుపత్రి అధికారులే సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినప్పుడు సమాధానం చెప్పడం విశేషం.

What has been the HDS's track record for 9 years?

హెచ్ డీఎస్ కమిటీలో చైర్మన్ గా జిల్లా కలెక్టర్, వైస్ చైర్మన్ డీఎంఈ, జిల్లా పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంచార్జి మంత్రి, మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్, సీనియర్ వైద్యుడు, ఆర్ఎంవో, ముగ్గురు ప్రొఫెసర్లు, మున్సిపల్ కమిషనర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఈఈ, మెడికల్ కాలేజి అల్యుమిని సభ్యుడు, హౌజ్ సర్జన్ చేసే పీజీ విద్యార్థి ఒకరు ప్రత్యేక ఆహ్వానితులుగా ఐఎంఏ, రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్, మహిళా సమాఖ్యాలకు సంబంధించిన అధ్యక్షులు సభ్యులుగా ఉంటారు. వారితో పాటు స్వచ్చంద సంస్థల నిర్వాహకులతో పాటు డీఎంహెచ్ వో, వైద్య విధాన పరిషత్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్, మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ , ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కన్వీనర్ గా వ్యవహరించే కమిటీ ఉండాలి. మూడు నెలలకొకసారి  హెచ్ డీఎస్ సాధారణ సమావేశాలు నిర్వహించాలి. 2016-2025 వరకు ఎలాంటి సమావేశాలు నిర్వహించినట్లుగా తీర్మాణాలు గానీ, మినిట్స్ బుక్స్ గానీ అందుబాటులో లేవు. 2016 నుంచి ఆసుపత్రిలో జరిగిన పద్దుల తాలుకు ఆడిట్ రిపోర్ట్స్ కూడా లేవు. అసలు హెచ్ డీఎస్ కమిటే లేనప్పుడు సమావేశాలు ఎలా జరుగుతాయనే దానికి అధికారుల వద్దే సమాధానం లేదు.

What has been the HDS's track record for 9 years?