Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 June 2025, 4:30 pm Posted by : ramakrishna

కొత్త వల

  • విద్యకు కార్పొరేట్ రంగు
  • సీబీఎస్ఈ విద్యా పాఠశాలలు ప్రారంభం
  • జేఈఈ.. ఐఐటీ విద్యా బోధన కూడా షురూ..

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో విద్యకు కార్పొరేట్ కల ఏయేటికాయేడు పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో స్టేట్ బోర్డు విద్య అందిస్తుడగా కేంద్ర విద్యా సంస్థల ద్వారా సీబీఎస్ఈ విద్యను అందిస్తున్నారు. అయితే పిల్లల తల్లిదండ్రుల కోరికను లేదా తమ పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను అందిద్దామన్న ఆలోచనను కార్పొరేట్ విద్యా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. కార్పొరేట్ విద్యకు హైదరాబాద్, ఆంధ్రకు వెళ్లకుండానే స్థానికంగా  కార్పొరేట్  విద్యను అందిస్తామని విద్యా సంస్థలు  అడుగు పెడుతున్నాయి. 2025-26 విద్యా సంవత్సరాన్ని కార్పరేట్ విద్యా సంవత్సరంగా చెప్పాలి.  అనుమతుల సంగతి దేవుడెరుగు కాని పాఠశాల, జూనియర్ ఇంటర్, ఐఐటీ, జేఈఈ ప్రవేశ పరీక్షలకు నీట్, ఎంసెట్ లకు స్థానికంగానే విద్యనందిస్తామని కార్పరేట్ పాఠశాలలు తలుపులు తెరిచాయి.

నిజామాబాద్ జిల్లాలో దాదాపు 600 ప్రవేట్ పాఠశాలలు ఉన్నాయి. జూనియర్ కాలేజీలు 300వరకు ఉన్నాయి. సీబీఎస్ఈ విద్యను కేంద్ర ప్రభుత్వం నిజాంసాగర్ నవోదయలో, కేంద్రీయ విద్యాలయాల ద్వారా బోధన్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అందించిన విషయం తెలిసిందే. గురుకులాల్లో మాత్రమే ఐఐటీ, నీట్ కోచింగ్ లు ఇచ్చేవారు. తాజాగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఉమ్మడి జిల్లాలో కాలుపెట్టి ఎంబీబీఎస్ సీట్లు గ్యారెంటే అని అదర గొడుతూ ప్రచారం చేస్తున్నాయి. జేఈఈ అడ్వాన్స్, ఐఐటీ సీట్లు మా కాలేజీల్లో చదివితే పక్కా వస్తాయని ప్రచారం చేస్తున్నాయి. ప్రవేట్ పాఠశాలలు తామేమీ తక్కువ కాదని అనుమతులేమో స్టేట్ బోర్డుని తీసుకుని సీబీఎస్ఈ విద్యా పేరిట కరిక్యులం అమలు చేస్తామని  ప్రచారం చేస్తున్నాయి. ఫీజులు మాత్రం హైదరాబాద్, మెట్రో పాలిటోనగరాలకు తీసిపోకుండా వసూళ్లకు రంగం సిద్ధం చేశారు.

విద్యను ఉచింతంగా అందించకుండా కేవలం ట్యూషన్ ఫీజు పేరిట పాఠశాలల స్థాయిలోనే వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. ప్రధానంగా కార్పొరేట్ కాలేజీల్లో ఫీజులు రెసిడెన్సియల్ కు లక్షా దాటించారు. డే స్కాలర్ కు రూ.60వేల పైచిలుకు ఫీజులు డిమాండ్ చేస్తున్నారు.  కార్పొరేట్ పాఠశాలని ప్రచారం చేస్తున్న విద్యా సంస్థలు సీబీఎస్ఈ అనుమతి ఉందా అన్న అనుమానాలు వ్యక్తం  అవుతున్నాయి. స్టేట్ బోర్డు అనుమతితోనే సీబీఎస్ఈ ఫీజులు గుంజే ప్రక్రియ జరుగుతుందని ఆరోపణలు లేకపోలేదు. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులను ర్యాంకుల పేరుతో   రాచి రంపాన పెట్టే కల్చర్  ఇందూర  జిల్లాలో అడుగుపెట్టినట్టయింది. పదో తరగతిలో ర్యాంకులు వచ్చిన వారిని అడ్మిషన్లు చేసుకుని వారి ద్వారానే ఇంటర్, నీట్,జేఈఈ అడ్వాన్స్ లో సీట్లు సాధించే కుట్ర జరుగుతోంది. ఇదిలా ఉండగా కొన్ని పాఠశాలలకు అనుమతులు లేవని, మరికొన్నింటికి రెన్యూవల్ లేదని ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలో 400  పైచిలుకు పాఠశాలలు ఉండగా ఈసంవత్సరం కొత్తగా 70పాఠశాలలు తెరిచేందుకు విద్యా శాఖ వద్ద అనుమతులు పెండింగ్ ఉన్నాయి. దాదాపు 30పాఠశాలలకు అనుమతులు రావని కానీ అప్పుడే ప్రచారం, అడ్మిషన్ల ప్రక్రియ సాగుతోంది. విద్యాశాఖ, ఇంటర్ మీడియట్ బోర్డు అధికారులు కార్పొరేట్ విద్యా సంస్థలపై నజర్ వేస్తేగాని విద్యార్థులకు నాణ్యమైన విద్య, తల్లిదండ్రులు నష్టపోకుండా ఉండే పరిస్థితి నెలకొంది.