Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 5:28 pm Posted by : ramakrishna

సంక్షేమం, పేదల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందే

  • ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి

 

మోపాల్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా పేదల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. మోపాల్ మండలం కులాస్‌పూర్ పెద్ద చెరువులో చేప పిల్లలను రాష్ట్ర మత్స్యశాఖ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చేతుల మీదగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగపుత్రుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం 100% సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తోంది. చెరువులను శుభ్రంగా ఉంచడం, కాలుష్యం లేకుండా సంరక్షించడం గంగపుత్రుల కీలక బాధ్యత” అని సూచించారు. చెరువుల్లో పెంచిన చేపలను మార్కెట్‌లో అమ్ముకోవడం ద్వారా గంగపుత్రులకు మంచి లాభాలు వస్తాయని అన్నారు. సంవత్సరానికి మూడు సార్లు గంగపుత్రులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, వారికి లైసెన్సులు జారీ చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం బీసీలకు వ్యతిరేక దృక్పథంతో వ్యవహరిస్తోంది” అని మండిపడ్డారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి పోటీలో దింపుతామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచిత రేషన్ బియ్యం, ఉచిత రేషన్ కార్డ్, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరా శక్తి క్యాంటీన్లు వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. బీజేపీ–బీఆర్‌ఎస్ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ఒకటయ్యాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసి ప్రచారం చేశాయి. కానీ ప్రజలు కాంగ్రెస్ వైపు నిలబడి అభ్యర్థిని గెలిపించారు” అని చెప్పారు. కులాస్‌పూర్ చెరువును పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చెరువులో దిగేందుకు మెట్లు, గట్టు పక్కన ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, మండల తహసీల్దార్, మత్స్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Welfare and development of the poor were done by the Congress government.