. . . పోచంపాడు ప్రాజెక్టు, పుష్కర ఘాట్లను పరిశీలించిన సీపీ
మెండోరా, బతుకమ్మ :
భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా అవసరమైన అన్ని చర్యలు చేపడతామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తులకు మెరుగైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనకు పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పోలీస్ కమిషనర్ గురువారం మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచంపాడు (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు), పుష్కర ఘాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అలాగే ఘాట్ల నిర్మాణ పరిస్థితులు, వాకింగ్ ట్రాక్‌లు, హెలిప్యాడ్ ఏర్పాట్లకు అనువైన ప్రదేశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాల ఏర్పాటు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, తాత్కాలిక పోలీస్ సహాయ కేంద్రాలు, వైద్య శిబిరాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, అత్యవసర స్పందన బృందాల ఏర్పాటు వంటి అంశాలపై ముందస్తు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, మెండోరా ఎస్సై సుహాసిని, ఇరిగేషన్ శాఖ డీఈ సురేష్, ఏఈ సుశాంత్ కుమార్, వంశీ, పంచాయతీరాజ్ శాఖకు చెందిన రెవెన్యూ ఇన్స్ పెక్టర్ వేణుగోపాల్, డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
