. . . కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
బాన్సువాడ, బతుకమ్మ :
అసాంఘిక శక్తులు సృష్టిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపుతామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ఓ మాల్లో సేల్స్గల్స్తో ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగాడన్నారు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందడంతో అతడిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. అయితే కొందరు వ్యక్తులు ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం రాత్రి బాన్సువాడ పోలీస్ స్టేషన్ ఎదుట రాళ్లు రువ్వుతూ హంగామా చేశారన్నారు. ఈ ఘటనలో తమ కానిస్టేబుల్ కి గాయాలయ్యాయని తెలిపారు. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 42 మందిపై కేసులు నమోదు చేయబోతున్నామని తెలిపారు. అలాగే బాన్సువాడ బంద్ అంటూ కొందరు పిలుపునిచ్చారని, సోషల్ మీడియాలో సైతం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, వారిని సైతం అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇప్పటికే ఒకరిపై కేసు నమోదైందని, మరికొందరిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. పట్టణంలో 144 సెక్షన్ పెట్టే అవసరం లేదని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఎస్పీ తెలిపారు. అదనపు బలగాలను సైతం పట్టణానికి రప్పించామన్నారు. అలాగే ప్రజలు సైతం ఎలాంటి అపోహలకు గురికావద్దని, సోషల్ మీడియాలో వచ్చే స్టేటస్ లను పట్టించుకోకుండా వారివారి పనులు చేసుకోవాలని సూచించారు. అలాగే రాళ్లు రువ్విన వ్యక్తులకు సంబంధించిన సీసీ పుటేజీలు వీడియోలను మూడు బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయని, ఎవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎస్పీ తెలిపారు. సమావేశంలో బాన్సువాడ డిఎస్పీ విట్టల్ రెడ్డి, ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసరావు, బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్, రూరల్ సిఐ తిరుపతయ్య పోలీస్ సిబ్బంది ఉన్నారు.