Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 2:34 pm Posted by : ramakrishna

బెదిరించే వాళ్లు కాంగ్రెస్ నాయకులైనా.. అధికారులైనా ఊరుకోబోం

బాన్సువాడ, బతుకమ్మ: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లొద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తునట్లు తెలుస్తోందని, బెదిరించే వారు కాంగ్రెస్ నాయకులైనా, అధికారులైనా ఊరుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట కవిత అన్నారు. బాన్సువాడలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఆమె ప్రసంగించారు. బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను, ప్రజలను బెదిరించే వారి పేర్లను పింక్ బుక్ రాసుకుంటున్నామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ నైజమని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్టులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి పంచి ఓట్లేయించుకున్నారని, ఇఫ్పుడు వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తామని పదేళ్లపాటు కాంగ్రెస్ ముప్పుతిప్పలు పెట్టిందని, వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు ఆ పార్టీయే కారణమని అన్నారు. ఏడాదిన్నర పాలనలోనే ఈ స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

తెలంగాణ కోసం కేసీఆర్ కేంద్ర మంత్రి పదవిని సైతం గడ్డిపోచలా వదిలేశారని, ఎవరో భిక్షపెడితే, ఎవరో దయతలిస్తే తెలంగాణ రాలేదని, కేసీఆర్ త్యాగం, కృషి పోరాటపటిమ వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు. తెలంగాణ ఏర్పడితే కటిక చీకటి వస్తుందని, నక్సలైట్ల రాజ్యం వస్తుందని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. కానీ తెలంగాణను కోటి ఎకరాల మాగాణాను తయారు చేసుకున్నామని, సాగునీటి పన్నును మాఫీ చేసిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. రైతుబంధు, రైతు బీమా వంటి అనేక పథకాలను కేసీఆర్ అమలు చేశారని, చివరి గింజ వరకు వడ్లు కొనుగోలు చేసి కేసీఆర్ చరిత్ర సృష్టించారన్నారు.

సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి, కామారెడ్డి జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.