Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 4:46 pm Posted by : ramakrishna

ఆంధ్ర పాలకుల జోక్యాన్ని సహించం

 

. . . టి.జే.ఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం

 

. . . టి.జే.ఎస్ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ వ్యవహారాల్లో ఆంధ్ర పాలకుల అనవసర జోక్యాన్ని సహించబోమని శాసన మండలి సభ్యులు, టి.జె.ఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లిలోని తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మహనీయులకు పుష్పాంజలి ఘటించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర గీతాలాపన నిర్వహించి, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాట్లాడుతూ వేలాది అమరుల త్యాగఫలం, లక్షలాది ఉద్యమకారుల పోరాటం, కోట్లాది ప్రజల ఆకాంక్షల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ అంటే తాము, తమ కుటుంబమే అన్న భావనతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ నియంతృత్వ పాలన సాగించిందని విమర్శించారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణం కోసం మరో పోరాటం అవసరమని భావించి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తూ, సంఘటితం చేస్తూ దానిని ఓడించడంలో మనం కీలక పాత్ర పోషించామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొందని, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడంలో గతంలా వేధింపులు లేవని పేర్కొన్నారు. అయితే నేటికీ ఆంధ్ర పాలక వర్గాలకు తెలంగాణ వనరులపై కన్ను ఉందని, తెలంగాణపై ఆధిపత్యం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.

 

We will not tolerate the interference of Andhra rulers.

 

ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ, ఆ సాకుతో తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఆంధ్ర పాలక వర్గాలకు మద్దతుగా నిలుస్తూ తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆంధ్ర పాలక వర్గాల సహకారంతో తెలంగాణపై పెత్తనం చెలాయించాలని బీజేపీ చూస్తోందని అన్నారు. పదేపదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచే విధంగా కేంద్రంలోని బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేయడం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవమానించడమేనని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం వెలుగులో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తెలంగాణపై బీజేపీ, ఆంధ్ర పాలక వర్గాలు చేస్తున్న ఇటువంటి కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ ఆశయాల సాధన, సమగ్ర తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిస్తూ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

We will not tolerate the interference of Andhra rulers.