నిజామాబాద్,బతుకమ్మ: నియోజకవర్గ అభివృద్ధిపై వివక్ష సహించమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి కేరాఫ్ అడ్రస్ అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి పనులు ఎక్కడా కనిపించడం లేదని, అవినీతి మాత్రమే విస్తరిస్తోందని ఆయన పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పలు సార్లు అంశాలు తీసుకువెళ్లినా, ప్రభుత్వం వాటిని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన తెలిపారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి నిధుల మంజూరు కోరుతూ వినతి పత్రం అందజేశామని, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఇటీవల వరదల వల్ల పంటలు నాశనం అయినా ప్రభుత్వం ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ రైతు పక్ష పార్టీ కాదు — రైతు బక్ష పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందించాలని, గత 12 సంవత్సరాలుగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిజామాబాద్ బస్టాండ్ శిథిలావస్థలో ఉందని, ప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడిన కొత్త బస్టాండ్ నిర్మాణం తక్షణం చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. అలాగే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంఆర్ఐ యంత్రం, డాక్టర్ల కొరత నివారణ, మరియు అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్ఓబీ పనులకు కేంద్రం నిధులు కేటాయించినప్పటికీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయకుండా పనులను నిలిపివేయడం వారి చేతకానితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై వివక్ష కొనసాగితే ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు న్యాలం రాజు, బీజేపీ మండల అధ్యక్షులు ఆనంద్ రావు, నాగరాజు, తారక్ వేణు, భూపతి బీజేపీ తాజా మాజీ కార్పొరేటర్స్ మాస్టర్ శంకర్, సాయివర్ధన్, బట్టు రాఘవేందర్, నిచ్చేంగ్ లతా కృష్ణ, పుట్ట వీరేందర్,బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.