నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించని పక్షంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని ఏఐపీఎస్ యూ జాతీయ కార్యదర్శి షఫీవుల్లా అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఏడు దశాబ్దాలుగా ఏఐపీఎస్ యూ పోరాటాలు చేస్తోందన్నారు. యూనియన్ మహాసభలను అంబేద్కర్ భవన్ లో నిర్వహించామని, గతంలో చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణను రూపొందించామని అన్నారు. కార్యాచరణను అమలు చేసేందుకు 13 మందితో నూన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా బోడ అనిల్, మన్నెకుమార్ ఎన్నికయ్యారని, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బేగరి సాయికుమార్, ఉపాధ్యక్షులుగా రాజు, కోశాధికారిగా ఆనంద్ తోపాటు ఎనిమిది మందిని సభ్యులుగా ఎన్నుకున్నామన్నారు. యూటీయూసీ రాష్ట్ర కన్వీనర్ ప్రభాకర్, మహిళా రాష్ట్ర కన్వీనర్ విజయలక్ష్మి, రాష్ర్ట నాయకులు గోపాల్ సింగ్, పరమేశ్వర్, రాజారాం తదితరులు పాల్గొన్నారు.