Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 5:58 pm Posted by : ramakrishna

మెజారిటీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో భాగస్వాములు చేస్తాం

 

. . . టిజిఎస్ ఆర్టీసి నిజామాబాద్ రీజనల్ మేనేజర్ వికే.మూర్తి

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

 

త్వరలో రాష్ట్రంలోని అన్ని డిపోలలో కార్మిక శాఖ  పర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్దతిలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించి, ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్దంగా మెజారిటీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములను చేస్తామని టీజీఎస్ ఆర్టీసి రీజనల్ మేనేజర్ వికే.మూర్తి అన్నారు. శనివారం ఆర్టీసి ఆర్ఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనేది కార్మిక, ఉద్యోగుల చిరకాల స్వప్నం అన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సానుకూలంగా ఉందని తెలియజేశారు. ఏప్రిల్ లో జరిపిన సమ్మె సమయంలో డిమాండ్ చేసిన ముఖ్యమైన మూడు అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించి సానుకూలంగా పరిగణించిందన్నారు. ఇందులో 2021 వేతన సవరణ యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం లో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అనంతరం ఈ ప్రక్రియను క్యాబినెట్ సబ్ కమిటీ పరిధిలోకి తెచ్చి విలీన ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ప్రభుత్వం పరిగణిస్తోం దన్నారు. ఆర్టీసీ విలీన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీ ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమై, విలీనానికి సంబంధించిన అన్ని సాంకేతిక, ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహించిందన్నారు. అదే విధంగా సమ్మె కాలంలో మిగిలిన డిమాండ్లపై ఆర్టీసీ ఈడీ ల కమిటీ కార్మిక సంఘాల తో చర్చలు జరుపుతోందన్నారు. వారి నుంచి వచ్చే విలువైన సూచనలు, సలహాలను క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలనకు పంపి అందరికీ ఆమోదయోగ్యం గా, నూటికి నూరు శాతం పారదర్శకంగా విలీన తుది ప్రక్రియను పూర్తి చేస్తామని, మీ భవిష్యత్తుకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని, ఎప్పటిలాగే మీ విధులను అంకితభావంతో నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నామన్నారు.