- తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్ ల సాధన కై తెలంగాణ జాగృతి 72 గంటల పాటు రేపటి నుంచి మూడు రోజులు నిరాహార దీక్ష చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ‘‘సానుకూలంగా మా దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. బీసీల్లో 112 కులాలు ఉన్నాయి. తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి రోజు 40 కులాలు మాట్లాడే అవకాశం ఉంటుంది. అన్ని కులాలు తమ సమస్యలు చెప్పుకునేందుకు కనీసం మూడు రోజులు పడుతుంది. అందుకే తెలంగాణ జాగృతి 72 గంటల పాటు నిరాహార దీక్షకు సిద్ధమవుతుంది. గాంధేయ మార్గంలో అన్నం తినకుండా , నీళ్లు తాగకుండా 72 గంటలు దీక్ష చేస్తున్నాము. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్, బిజెపి కలిసి నాటకాలు ఆడుతున్నాయి. ఆర్డినెన్సు పై బిజెపి స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదు. బిసి రిజర్వేషన్ల పై బిజెపి ధర్నా కామెడీ ధర్నాలా ఉన్నది, దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ఉన్నది. తెలంగాణ ఆడ బిడ్డను నేను నా పైన కొందరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రజలందరూ స్పందించారు. బిఆర్ఎస్ పార్టీ మాత్రం స్పందించలేదు. నా పైన కొందరు చేస్తున్న వ్యాఖ్యల పట్ల బిఆర్ఎస్ పెద్దల హస్తం ఉన్నది , అందుకే నా పైన కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. నేను భయపడే వ్యక్తిని కాదు , తెలంగాణ కోసమే కొట్లాడిన. బిఆర్ఎస్ పార్టీలో లిల్లీపుట్ నాయకుడు ఉన్నాడు, ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి. కేసీఆర్ లేకపోతే, ఆయన లేడు. నా పైన ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. నేను కేసీఆర్ కు రాసిన లేఖ ఏ విధంగా బహిర్గతం అయింది నాకు తెలుసు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ సర్వ నాశనం కావడానికి ఆయనే కారణం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణం ఆయనే. ఆయన గెలుపు చావు తప్పి కన్నులొట్ట పోయినట్లు ఉన్నది. లిల్లీపుట్ నాయకుడు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సీఎం రమేష్ ఎందుకు వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు. సీఎం రమేష్ వ్యాఖ్యల వెనుక నేను కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అవ్వడానికి సంబంధం ఉంది. నాకు ఎవరి సపోర్ట్ లేదు మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్లకే అలవాటు. అధికారంలోకి వచ్చాక పార్టీలోకి వచ్చి పదవులు పొందారు. బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ పార్లమెంట్ లో మాట్లాడలేదు. రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ అడిగితే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వరా. రేపటి నుంచి మేము చేస్తున్న దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి’’ అని అన్నారు.
