Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 12:17 pm Posted by : ramakrishna

మూసీ, ఈసా నదులను గోదావరి నీళ్లతో నింపుతాం

హైదరాబాద్, బతుకమ్మ : మూసీ నది పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడారు. గోదావరి నుంచి 20 టీఎంసీలు తరలించి మూసీ, ఈసా నదులను ఆనీళ్లతో నింపుతామన్నారు. ఏడాదంతా మూసీ నదిలో నీళ్లు ప్రవహించడానికి ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. మూడు సంస్థలు జాయింట్ వెంచర్ కింద మూసీ పునరుద్ధరణ చేపట్టాయన్నారు. యూపీలో గంగా ప్రక్షాళన చేశారని, ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. మూసీని కలుషితం చేయడంతో నల్గొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందే అని స్పష్టం చేశారు. జలవనరులను కాపాడాల్సిన మన ప్రజాప్రతినిధులే వాటిని కబ్జాలు చేసి ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఫామ్ హౌస్ డ్రెయినేజీ లైన్లను తీసుకెళ్లి గండిపేట్ హిమాయత్ సాగర్ లో కలిపారని వ్యాఖ్యనించారు. నగరంలో లక్షలాది మంది తాగే నీళ్లను పొల్యూట్ చేస్తే క్షమించమని చెప్పి కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. చర్యలు తీసుకున్నందుకు జన్వాడ, మొయినాబాద్ లలో ఫామ్ హౌస్లు కట్టుకున్నోళ్లు రూ.కోట్లు ఖర్చు చేసి నన్ను బద్నామ్ చేద్దామని చూశారని తెలిపారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదని సీఎం  పేర్కొన్నారు.