- ఆత్మహత్యల ఆలోచనలు వద్దు
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నిజామాబాద్, బతుకమ్మ : రైతులకు పట్టాలు ఇచ్చే వరకు వారి తరఫున పోరాడుతామని, ఆత్మహత్యల ఆలోచనలు వద్దంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రైతులకు ధైర్యం చెప్పారు. జాగృతి జనం బాటలో భాగంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు రైతులను ఆదివారం కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు పంట ధ్వంసం చేయడంతో ఆత్మహత్యయత్నం చేసిన రైతు రామావత్ ప్రకాశ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక మంచిప్ప ప్రాజెక్ట్ పెద్దగా చేసుకోవాలని ప్రయత్నించాం. కానీ అది చేసుకోలేకపోయాం అన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడకు ప్రచారానికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టను అని చెప్పారని గుర్తు చేశారు. అలాంటప్పుడు రైతులకు ఈ భూములను పట్టా చేయాలని, ఇవాళ కాకపోతే రేపైనా రైతులకు పట్టా చేయిస్తాం అని అన్నారు. ప్రాజెక్ట్ కట్టనప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి పోడు రైతులను ఇబ్బంది పెట్టవద్దని నేను ప్రభుత్వాన్ని, ఇక్కడి మంత్రులను, జిల్లా కలెక్టర్ ను కోరుతున్నానని తెలిపారు.

అదే విధంగా ఇక్కడి 9 తండాలు, 3 గ్రామ పంచాయితీలకు పట్టాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కట్టబొమని ప్రభుత్వం స్టాండ్ తీసుకున్నప్పుడు ఇక్కడి పోడు రైతులకు పట్టాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. మిగతా పట్టా ల్యాండ్ ల విషయంలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని కోరారు. చేతికొచ్చిన పంటపై విషం చల్లటమంటే ఎంత దారుణం? ఎంత అన్యాయం ఇది? రైతు ఎంత ఆగమైతడు? రైతులను పంట కోసుకొనివ్వచ్చు కదా? ఇంత నిరంకుశంగా, కర్కషంగా ప్రభుత్వాలు ఉండటం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రజలను పిల్లల మాదిరిగా చూసుకోవాలని, ఇంత దారుణంగా ఉండటం అన్యాయంమని అన్నారు. మంచిప్ప చుట్టుపక్కల ఉన్న రైతులను ఫారెస్ట్ వాళ్లు ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు.
