. . . పివికె – 5 గనిలో పర్యటన
. . . తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత
కొత్తగూడెం, బతుకమ్మ :
సింగరేణి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని తెలంగాన రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. సింగరేణి రెండో విడత బాయిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం కొత్తగూడెంలోని పీవీకే – 5 గనిని సందర్శించారు. గనిలోకి దిగి కార్మికుల పని పరిస్థితులను పరిశీలించిన ఆమె, కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణికి సంబంధించిన గనుల అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. నిజాం కాలంలో సింగరేణికి ఉన్న 17 గనుల్లో ప్రస్తుతం ఒక్క గనిని మాత్రమే తిరిగి ఇచ్చారని, మిగిలిన 16 గనులను కూడా సాధించే వరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల కోసం మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ నెల 20న నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. గతంలో నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డులు నిర్వహించేలా కృషి చేశామని, దాని ద్వారా వేలాది మంది యువతకు సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు లభించాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారినప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలను వెంటనే క్లియర్ చేయాలి. ఆ తర్వాత నెలకు ఒకసారి అయినా మెడికల్ బోర్డు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం 30 నెలల్లో ఒక్కసారి మాత్రమే మెడికల్ బోర్డు నిర్వహించిందని, అందులోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయని అన్నారు. సింగరేణి కార్మికుల కృషి, త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందని కవిత అన్నారు. సింగరేణి ద్వారా లక్షలాది ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని సింగరేణి ఆధ్వర్యంలో నడిపించేలా చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో ఇసుక తవ్వకాల బాధ్యతను కూడా సింగరేణికి అప్పగించేలా ప్రయత్నిస్తామని తెలిపారు. గనుల్లో కార్మికులకు అందిస్తున్న బూట్లు, గ్లౌజులు నాణ్యత లేనివిగా ఉన్నాయని కవిత ఆరోపించారు. కార్మికులకు సరైన నీరు, గాలి అందించకుండా ఎక్కువ గంటలు పని చేయించడం అన్యాయమని అన్నారు. అధికారులు బ్రిటిష్ కాలం నాటి ధోరణిలో కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో కార్మికులతో వ్యవహరించాలని సూచించారు. సింగరేణి సంస్థ కార్మికులు, అధికారులు అందరికీ జీవనాధారమని, ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదని పేర్కొన్నారు. కార్మికులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని కవిత సూచించారు. హక్కుల కోసం పోరాడేందుకు భయపడవద్దని, ధర్మం తమ వైపు ఉంటే ఎవరినైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 25 కార్మిక చట్టాలను నాలుగు చట్టాలుగా కుదించి కార్మికుల హక్కులను తగ్గిస్తోందని ఆమె ఆరోపించారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో తీర్మానం చేయించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేయవద్దని, కార్మిక సంఘాలు వారి హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని కవిత కోరారు.
