. . . ఎస్‌ఎల్‌బీసీ ద్వారా కృష్ణా జలాలు నల్గొండకు తీసుకొస్తాం
. . . రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నల్గొండ, బతుకమ్మ :
మూసీ నది ప్రక్షాళనను ఎలాంటి ఆటంకాలు ఎదురైనా పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కనగల్ మార్కెట్ యార్డులో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి పైలాన్ ఆవిష్కరించడంతో పాటు, నల్గొండ పట్టణంలో తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.83 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్‌జీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి, మూసీ నది ప్రక్షాళన తన కల అని పేర్కొన్నారు. “ఎవరు అడ్డుకున్నా మూసీ ప్రక్షాళన పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. మూసీ కాలుష్యం వల్ల ఇబ్రహీంపట్నం, భువనగిరి, మునుగోడు, నల్గొండ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వారికి శాశ్వత విముక్తి కల్పిస్తాం” అని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టును నూటికి నూరు శాతం పూర్తి చేసి కృష్ణా జలాలను నల్గొండ నేలపై ప్రవహింపజేస్తామని సీఎం ప్రకటించారు. అలాగే డిండి ప్రాజెక్టు పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని, ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గత 30 నెలల్లో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. లక్షలాది రేషన్ కార్డుల జారీ, రాష్ట్రంలోని 3.28 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ రంగానికి 30 నెలల్లో రూ.1.56 లక్షల కోట్ల వ్యయం చేశామని, 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించామని తెలిపారు.

ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం, కులగణన, 70 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యా వ్యవస్థను విస్తరించామని, విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నామని తెలిపారు. నైపుణ్యాభివృద్ధికి స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసిన సీఎం, గత పదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కంటే విధ్వంసమే ఎక్కువ జరిగిందని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలపై అవసరమైతే అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
