. . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆదిలాబాద్, బతుకమ్మ :
రైతుల పంటల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి పంటలను కోటాకు మించి కొనుగోలు చేయబోమన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 15 రోజుల క్రితం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి మేరకే పంటలు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం రైతాంగానికి నష్టదాయకమని ఆయన అన్నారు. పంట దిగుబడులు అధికంగా వచ్చిన రైతులు మిగిలిన ధాన్యాన్ని, ఇతర పంటలను బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి రైతు వద్దకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతులకు ఇచ్చిన బోనస్ హామీలు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పంటల కొనుగోలు అంశాలపై కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని సూచించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కూడా బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో వెనుకంజ వేసినప్పుడు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి పంటల కొనుగోలు జరిగేలా చేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల ద్వారా రైతులకు పెద్ద ఎత్తున మద్దతు అందించామని, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పండిన ప్రతి గింజను కొనుగోలు చేశామని చెప్పారు. ప్రస్తుతం రైతులు పంటల కొనుగోలు సమస్యలు, ఎరువుల కొరత, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆరోపించిన కేటీఆర్, రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
