. . . ప్రస్తుత బాడీని రద్దు చేస్తున్నాం
. . . నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకుడు, అధ్యక్షుడు బండారి భోజన్న
. . . ఆదివాసీ నాయకపోడ్ రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల సమావేశం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రస్తుత బాడీని రద్దు చేస్తున్నామని, అధికారికంగా నూతన బాడీ ఎన్నిక ప్రక్రియను చేపడతామని నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకుడు అధ్యక్షుడు బండారి బోజన్న తెలిపారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని ధర్మారం (బి) గ్రామ శివారులోని ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్‌లో ఆదివాసీ నాయకపోడ్ రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా సీనియర్ నాయకుడు అధ్యక్షుడు బండారి భోజన్న, జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్ల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కుల సంఘం బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడు కూన దయానంద్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు మెసిలేని రాజన్న, పళ్ళ సత్యనారాయణలు మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు పసుల బుచ్చయ్య నేతృత్వంలోని కమిటీ ఆశించిన స్థాయిలో సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత బాడీని రద్దు చేస్తున్నామని, త్వరలోనే నూతన రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నామని వారు ప్రకటించారు. ఈ విషయాన్ని రాష్ట్ర గిరిజన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, అధికారికంగా నూతన బాడీ ఎన్నిక ప్రక్రియను చేపడతామని స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పడే రాష్ట్ర కార్యవర్గం గ్రామస్థాయి నుంచి కులస్తులను ఏకం చేయడమే కాకుండా, ప్రభుత్వం నుండి అందే సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి చేరేలా కృషి చేయాలని నాయకులు సూచించారు. ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు 13 జిల్లాల నుండి ఒక్కొక్క సభ్యునితో కూడిన తాత్కాలిక ఆడక్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెంక భూమయ్య, మొసలి చిన్నయ్య, గంజి రాజన్న, భూమయ్య, వేంపల్లి గంగాధర్ భీముడు, శంకర్, లింగన్న, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 30 మంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
