Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 4:59 pm Posted by : ramakrishna

ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం

 

. . . జిల్లా యువజన, క్రీడల అధికారి పవన్ కుమార్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరపున ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా యువజన, క్రీడల అధికారి పవన్ కుమార్ అన్నారు. నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్యూరియస్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు ఎన్. వర్షిణి, సాయి బాబాలకు సోమవారం నిర్వహించిన ఘన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహారాష్ట్రలోని పుణే నగరంలో జూలై 8 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన 5వ ఇండియా తైక్వాండో పూమ్సే నేషనల్ ఛాంపియన్‌షిప్ – 2026, 5వ ఇండియా ఓపెన్ పారా నేషనల్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ – 2026 లో జాతీయ స్థాయిలో పతకాలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి, నిజామాబాద్ జిల్లాకు కీర్తి తీసుకొచ్చిన క్రీడాకారులను బొకేలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

 

We will always stand by talented athletes.

 

ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం ద్వారా జిల్లాకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన వర్షిణి, సాయి బాబాలను అభినందించారు. జిల్లాలో మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అవసరమైన ప్రోత్సాహం, సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

 

We will always stand by talented athletes.

 

జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా నుంచి జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం గర్వకారణమని, కష్టపడే ప్రతి క్రీడాకారుడికి విజయం తప్పకుండా లభిస్తుందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ చైర్మన్ డా.రమేష్ పవార్ మాట్లాడుతూ, వర్షిణి, సాయి బాబాల విజయాలు కృషి, క్రమశిక్షణ, అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. పారా విభాగంలో సాయి బాబా సాధించిన రజత పతకం ప్రత్యేకమైన విజయమని కొనియాడారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు అజ్మత్ ఖాన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి జాతీయ స్థాయికి తీర్చిదిద్దడంలో జిల్లా, రాష్ట్ర తైక్వాండో సంఘాలు సమిష్టిగా కృషి చేస్తున్నాయని తెలిపారు. క్యూరియస్ తైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు, ప్రధాన కోచ్, జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్ మాట్లాడుతూ, 2026 అక్టోబర్‌లో దక్షిణ కొరియాలో జరగనున్న ప్రపంచ తైక్వాండో పూమ్సే ఛాంపియన్‌షిప్ భారత జట్టు ఎంపిక తుది ట్రయల్స్‌కు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక మహిళా క్రీడాకారిణి ఎన్. వర్షిణి అని తెలిపారు. ఇది తెలంగాణ తైక్వాండోకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి జావీద్, తైక్వాండో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మురళి, కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్, నాగరాజు, సంతోష్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు, తల్లిదండ్రులు, క్రీడాకారులు పాల్గొని జాతీయ పతక విజేతలను అభినందించి వారి భవిష్యత్ విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు.

 

We will always stand by talented athletes.