Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 6:16 pm Posted by : ramakrishna

ప్రమోద్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటాం

  • ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్‌లో రౌడీషీటర్ దాడిలో వీరమరణం పొందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్నిగురువారం వారు పరామర్శించి, రూ.2లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మట్లాడారు. ప్రభుత్వం తరఫున కోటి రూపాయలు పరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నిజామాబాద్ పట్టణంలో 300 గజాల ఇంటి స్థలం అందిస్తున్నామని తెలిపారు. ఆర్థికంగా సహాయం చేయగలం కానీ వారి కుటుంబానికి మానసికంగా జరిగిన గాయాన్ని ఎవరు పూడ్చలేరన్నారు. రాష్ట్ర  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పోలీసు వర్గాల్లో కొంతమేర ఉపశమనం కలిగించిందన్నారు. ప్రమోద్ చేసిన సేవలు మరువలేనివని, ఆయన త్యాగం పోలీసు శాఖ గౌరవాన్ని పెంచి ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం పెరిగిందని తెలిపారు. పోలీస్ శాఖ సిబ్బంది భద్రత, సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించేందుకు పోలీసులకు ప్రభుత్వం నైతిక బలం అందిస్తుందని పేర్కొన్నారు. ప్రమోద్ కుటుంబానికి అందించే ఈ సాయం ఆయన చేసిన సేవలకు ప్రభుత్వ గౌరవ సూచకమని, ఇది పోలీసు శాఖలో ప్రతి సభ్యుడికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రమోద్ త్యాగం పోలీసు వ్యవస్థలో కర్తవ్యనిష్ఠకు ప్రతీకగా నిలిచిపోతుందని ఆయన కొనియాడారు.

We will always stand by Pramod's family.