- రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి
డిచ్పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి దంపతులు ఆదివారం డిచ్పల్లి మండలం సాంపల్లి తాండాలోని జగదంబ మాత, సేవాలాల్ మహారాజ్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో సాంపల్లి తండావాసులు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే జగదంబ మాతకు ముక్కుపుడక, ఒడిబియ్యం సమర్పిస్తామని మొక్కుకోగా ఆ మొక్కును ఎమ్మెల్యే దంపతులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంపల్లి తండాకు కావాల్సిన నిధులు కేటాయిస్తానని, ఇప్పటికే మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. పాఠశాల ప్రహరీగోడ, మహిళా సంఘాల భవనం, అంగన్వాడి భవనం నిర్మాణం కోసం కృషి చేస్తున్నానని హామీ ఇచ్చారు. మహిళలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, పంట రుణ మాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తోందని వివరించారు. మంచి పని రిజర్వాయర్ పాత డిజైన్ ప్రకారమే జీవో త్వరలో వస్తుందని తెలిపారు. బిజెపి, టీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని విమర్శిస్తూ, స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42%, ఎస్టీలకు 10%, ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించిన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి వినోదిని రెడ్డి, మండల అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు కంచెటి గంగాధర్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
