Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 6:21 pm Posted by : ramakrishna

మహాత్మా జోతిభా ఫూలే ఆలోచన విధానంలో మనం సైతం

 

. . . ప్రశ్నతో సమాధానాలు, పరిష్కారాలు.. బార్ అధ్యక్షుడు నీలకంఠ రావు

 

. . . నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జోతిభా ఫూలే ఆలోచన విధానంలో పౌర సమాజం మమేకం కావాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు అన్నారు. రెండు వందల ఏళ్ల క్రితమే మహిళల విద్యకు పునాదులు వేసిన గొప్ప సామాజిక సంఘసంస్కర్త ఫూలే అని ఆయన తెలిపారు. ఫూలే తన భార్య సావిత్రి భాయి ఫూలే కు చదువు నేర్పించి ఆమె ద్వారా మరేంతో మంది మహిళలకు విద్యను అందించి జ్ఞానాన్ని కలిగించారని అన్నారు. ఫూలే సిద్ధాంతాలను భావి తరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత నేటి తరం పైనే ఉన్నదని నీలకంఠ రావు పేర్కొన్నారు. బార్ ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం వైపు పయనం కొనసాగించి ఫూలే ఆశయసాధనను పూర్తి చేద్దామని అన్నారు. ఫూలే ప్రవచించినట్లు ప్రశ్నించేతత్వం అలవర్చుకుని సమాధానాలు రాబట్టుకుని పరిష్కారం వైపు పయనించాలన్నారు. సమాజంలో సమభాగమైన మహిళలకు అన్ని రంగాలలో సమబాగం ఉన్నప్పుడే సమాజం ప్రగతి వైపు పరుగులు తీస్తుందని సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. న్యాయవాదులు మాణిక్ రాజు, ఆశ నారాయణ, జగన్ మోహన్ గౌడ్, ఎండల ప్రదీప్ లు మాట్లాడుతూ మహిళల విద్యకు పెద్దపీఠ వేసి వారిని ఉన్నత స్థానంలో నిలిపిన మహనీయుడు మహాత్మా జోతిభా ఫూలే అంటు వారు కొనియాడారు. అసమానతలు లేని సమాజం కోసం ప్రాణాన్ని సైతం పణంగా పెట్టబోయిన పెద్దరికం ఫూలే సొంతమని అన్నారు. ఫూలే జయంతి రోజే జేజేలు పలికిన, ఫూలే సమాజంలో వెదజల్లిన విద్య, సమానత భీజాలను భుజాన వేసుకుని అణగారిన ప్రజా సమూహలకు చేరువ చేద్దామని వారు అభిప్రాయపడ్డారు. భారతావనిలో ప్రభవించిన ఫూలే అనే పువ్వు సుఘంధాల పరిమళాలు నేడు దేశవ్యాప్తంగా పరుచుకున్నాయని వారు తెలిపారు. అంతకు ముందు ఫూలే చిత్రపటానికి న్యాయవాద కుటుంబం తరపున పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్, న్యాయవాదులు దేవదాసు, సుజిత్, పులి జైపాల్, బోయిని సామేల్, జీషాన్, మహమ్మద్ ఖాళీద్ తదితరులు పాల్గొన్నారు.