Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 8:12 pm Posted by : ramakrishna

నిరుపేదలకు సేవలందించే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలి

 

. . . వైద్యారోగ్య శాఖ పనితీరుపై సమీక్షలో  కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిరుపేద ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తూ అంకిత భావంతో మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యాధికారులకు, సిబ్బందికి హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై కలెక్టర్ గురువారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, పీ.హెచ్.సీలు, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయి నుండి మొదలుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన పనులను అంకితభావంతో సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. పీ హెచ్ సి స్థాయిలో మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్, సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, తమ ఉద్యోగాన్ని దైవంతో సమానంగా భావించాలని అన్నారు. వైద్యారోగ్య శాఖ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తామని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకపోయినా చర్యలు కఠినంగానే ఉంటాయన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరు సక్రమంగా లేకపోతే, అది ప్రజా జీవనంపై పెను ప్రభావం చూపుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సమిష్టిగా, సమన్వయంతో పని చేస్తూ సత్ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రతి పి.హెచ్.సి, సబ్ సెంటర్లలో అన్ని రకాల ఔషధాలు, కనీస సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ప్రైవేటు, కార్పొరేటు హాస్పిటల్లకు  దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. మాతా శిశు మరణాలు జరగకుండా ముందు నుండే గర్భిణీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన చికిత్సలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు నర్సింగ్ హోం లలో కూడా సాధారణ ప్రసవాలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని అన్నారు. సమీక్షా సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, మెడికల్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

 

we-should-consider-ourselves-fortunate-to-have-the-opportunity-to-serve-the-underprivileged