Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 8:15 pm Posted by : ramakrishna

గ్రామ పరిశుభ్రతపై బాధ్యతగా వ్యవహరించాలి

 

. . . మండల పంచాయతీ అధికారి రాము

 

జుక్కల్, బతుకమ్మ :

 

గ్రామ పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని మండల పంచాయతీ అధికారి రాము పిలుపునిచ్చారు. జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామపంచాయతీలో గురువారం స్వచ్ఛ భారత్ అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామసభకు మండల పంచాయతీ అధికారి రాము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామ ప్రజలందరూ సహకరించి బస్వాపూర్‌ను పరిశుభ్రమైన గ్రామపంచాయతీగా తీర్చిదిద్దాలని సూచించారు. సర్పంచ్ వి. రమణ సురేష్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వంట చేసిన అనంతరం ఆహార పదార్థాలను శుభ్రమైన వస్త్రంతో కప్పి ఉంచాలని సూచించారు. అలాగే నీటి తొట్టెలు, డ్రమ్‌లలో నీటిని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచకుండా తరచూ శుభ్రపరచుకోవాలని తెలిపారు. ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని కోరారు. గ్రామంలోని ఏ వార్డులోనైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపట్టేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ, అగ్రికల్చర్ ఏఈఓ, ఉపాధి హామీ సీఈఓ, గ్రామపంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ మరియు ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.