హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ తల్లిని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తల్లిలా మార్చారని, ఆ తల్లిని తాము తిరస్కరిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన పనిని చూసి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని కోట్లాది మంది బిడ్డల్లో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పూవులను బతుకమ్మగా పేర్చి పూజించే సంస్కృతి తెలంగాణ తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదని, తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలనుకుంటే ముందు గన్ పార్క్ వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.
కవిత అరెస్ట్
దీక్ష విజయ్ దివస్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు కవిత నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, అదానీ చిత్రాలతో ఉన్న టీషర్టులను ధరించి వారంతా అసెంబీలకి బయల్దేరారు. అసెంబ్లీ గేటు వద్ద కేటీఆర్, కవితతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.