- రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
కమ్మర్ పల్లి, బతుకమ్మ : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. గ్రామ సభల కార్యక్రమంలో భాగంగా గురువారం కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామంలో గ్రామ సభను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతు బంధు సాగు చేసే భూమితో పాటు వెంచర్లుగా మారిన భూములకు, గుట్టలకు ,రోడ్లకు ఇచ్చారని తెలిపారు. అందులో భాగంగా మన ప్రాంతంలోని గుట్ట భూమి 106 ఎకరాలకు అర్హత లేని భూమికి రైతుబంధు ఇచ్చారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కేవలం సాగు చేసే వారికే రైతుబంధు రావాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సాగు చేసే భూమిని సర్వే చేయించడం జరిగిందని తెలిపారు. తద్వారా రైతుబంధు ఆలస్యం అవ్వడం జరిగింది కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు సాగు చేసే భూములకు అందిస్తామని తెలిపారు గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేశారని, ఆయన తర్వాత గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా మార్పులు చేర్పులు మాత్రమే చేసిందని తెలిపారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్హత కలిగిన పేద కుటుంబాలన్నింటికీ కొత్త రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య,టకుర్ దేవేందర్,చిన్నోళ్ల రెడ్డి,జలేందర్,గడ్డం అశోక్ రెడ్డి,లక్పతి,హనుమండ్లు,అరుణ్ కుమార్ రెడ్డి,పవన్ రెడ్డి,జీవన్,లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.