Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 December 2025, 5:00 pm Posted by : ramakrishna

ఒలింపిక్స్ కు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా సన్నద్ధం కావాలి

  • విద్యార్థులకు ప్రేరణ కల్పించిన కలెక్టర్
  • క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని హితవు

 

నిజామాబాద్, బతుకమ్మ : ఒలింపిక్స్ క్రీడా పోటీలలో ప్రాతినిధ్యం దక్కేలా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి విద్యార్థిని, విద్యార్థులకు ఉద్బోధించారు. అంకిత భావంతో కఠోర సాధన చేస్తే ఒలింపిక్స్ లక్ష్యం సాధించవచ్చని ప్రేరణ కల్పించారు. జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పలువురు విద్యార్థిని, విద్యార్థులు వాలీబాల్ క్రీడలో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని ప్రతిభను చాటడం, పూర్వ విద్యార్థులు స్పోర్ట్స్ కోటాలో వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విషయాలను గమనించిన కలెక్టర్, విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. క్రీడల్లో రాణించడం వల్ల సమకూరే ప్రయోజనాల గురించి వారికి సవివరంగా తెలియజేశారు. విద్య, ఉద్యోగావకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్ తో పాటు, ఎంతో పేరు, ప్రఖ్యాతులు వస్తాయన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకే పరిమితం కాకుండా ఒలింపిక్స్ క్రీడలలో పాల్గొనే స్థాయికి చేరుకునేలా నిరంతర సాధన ద్వారా ప్రతిభను మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఒకే పాఠశాల నుండి వంద మందికి పైగా జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలలో పాల్గొనే అవకాశం లభించడం గొప్ప విషయమని, గ్రామాభివృద్ధి కమిటీ తనవంతు తోడ్పాటును అందిస్తుండడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు మరింత పట్టుదలతో కృషి చేస్తే ఒలింపిక్స్ స్థాయికి చేరడం కష్టమేమీ కాదన్నారు.

We need to prepare with the goal of representing the Olympics.

ఈ దిశగా స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకుని విద్యార్థులకు నాణ్యమైన తర్ఫీదును అందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వ్యాయామ ఉపాధ్యాయుడు, వాలీబాల్ కోచ్ శ్రీనివాస్ ను ఆదేశించారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో రాణిస్తున్న విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక అయ్యేలా సన్నద్ధం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై, చేయాల్సిన కృషి గురించి సమగ్ర అధ్యయనం చేసి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సూచించారు. క్రీడల్లో ఆసక్తి కనబర్చే విద్యార్థిని, విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో విద్యార్థులు సాధించిన పతకాలు, మెమొంటోలు, ట్రోఫీలను కలెక్టర్ పరిశీలించి, క్రీడాకారులను, కోచ్ ను అభినందించారు. అంతకుముందు పాఠశాలలో విద్యార్థులు కోసం వండిన మద్యాహ్న భోజనం నాణ్యతను కలెక్టర్ తనిఖీ చేశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, సరుకుల నాణ్యత విషయంలో రాజీ పడకూడని, వంట గ్యాస్ పైనే భోజనం వండాలని సూచించారు. పాఠశాలలో మిషన్ భగీరథ మంచినీటి వసతి, బాలబాలికలకు వేర్వేరు టాయిలెట్స్, గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలు తదితర వసతులను పరిశీలించారు. కిచెన్ గార్డెన్ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక అధికారులు ఉన్నారు.

We need to prepare with the goal of representing the Olympics.