. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డా.బి.రాజశ్రీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మాతృ మరణాలను పూర్తిగా నివారించేందుకు అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం మాతృ మరణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఎంసీహెచ్ సూపర్వైజర్లు ప్రతి గర్భిణీ స్త్రీని గర్భం దాల్చిన 12 వారాల్లోపు నమోదు చేయడంతో పాటు కనీసం నాలుగు సార్లు వైద్యులచే పరీక్షలు చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీలకు ధనుర్వాతం రాకుండా అవసరమైన టీకాలు అందించాలని, ప్రమాదకర లక్షణాలు ఉన్న గర్భిణీలను ముందుగానే గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతి గర్భిణీకి ఎత్తు, బరువు, రక్తపోటు, హిమోగ్లోబిన్ (హెచ్‌బీ), రక్తహీనత వంటి సాధారణ పరీక్షలతో పాటు హైపర్ టెన్షన్, ప్లేట్లెట్స్ తదితర పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ప్రమాదాలను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రసవం కోసం ముందస్తు ప్రసవ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సాధారణ ప్రసవాల కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే, ప్రమాదకర లక్షణాలు ఉన్న గర్భిణీలను స్త్రీ వైద్య నిపుణులు అందుబాటులో ఉన్న ఆసుపత్రులకు రిఫర్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు.

ప్రసవ సమయానికి గర్భిణీల వెంట ఆశా కార్యకర్తలు తప్పనిసరిగా ఉండి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. “మదర్ ఇన్ – మదర్ అవుట్” కార్యక్రమంలో భాగంగా గర్భిణీల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించి, ఫోన్ ద్వారా అందించే ఆరోగ్య సేవలను గుర్తించి నమోదు చేయాలని సూచించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఎల్ఎంపీ, ఈడీడీ వివరాలను సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు. మాతృ మరణం సంభవించకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని, అనివార్య పరిస్థితుల్లో ఎక్కడైనా మాతృ మరణం జరిగితే గర్భిణీ ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి అందించిన వైద్య సేవలు, చికిత్స వివరాలు, రిఫరల్ కారణాలు, డాక్యుమెంటేషన్ వంటి పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. ఆసుపత్రి స్థాయి ఆడిట్‌తో పాటు సామాజిక స్థాయి ఆడిట్ నిర్వహించి, మాతృ మరణాల నమోదు ఫార్మాట్‌లో పూర్తి వివరాలను పొందుపరచాలని సూచించారు. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో లోపాల కారణంగా ఒక్క మాతృ మరణం కూడా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డాక్టర్ రాజశ్రీ పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మాతృ మరణాలు నమోదైన మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అయిన మాలపల్లి, సిరికొండ, గౌతమ్ నగర్‌లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ సికందర్ నాయక్, ప్రొఫెసర్ డాక్టర్ ఉమ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ బి. ఇందు, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శాలిని, డాక్టర్ వనిత, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శిఖరా, ఎస్‌వో రాజేశ్వర్, డిప్యూటీ డెమో దుర్గారావు, డీహెచ్ఈలు గన్‌పూర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డా.అరవింద్, డా.రాణా ప్రతాప్, డా.శరత్ చంద్ర, ఎంఎల్‌హెచ్‌పీలు, పర్యవేక్షణ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
