Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 8:11 pm Posted by : ramakrishna

‘తెలంగాణ రైజింగ్’ కోసం పనిచేయాలి

 

. . . తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

మైనారిటీ యువత విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన వారు ‘తెలంగాణ రైజింగ్’ కోసం పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హిందూ, ముస్లింల మధ్య తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇద్దరూ తనకు రెండు కళ్లలాంటి వారని ఆయనన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌ లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎంపికైన వారితో పాటు నీట్, ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన మొత్తం 782 మంది మైనారిటీ అభ్యర్థులను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చదువొక్కటే మన భవిష్యత్తును మార్చుతుంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు చదువుకోవాలి. ఆ తర్వాత విద్యార్థులు స్కిల్స్‌పై దృష్టి సారించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నైపుణ్యాలు ఉన్న వారికి ఉద్యోగావకాశాలకు కొదవలేదు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లోనూ నైపుణ్యం కలిగిన వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు. యువతను నైపుణ్యాల్లో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని, పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చామని సీఎం తెలిపారు.

 

We must work for ‘Telangana Rising’.

 

నైపుణ్యం ఉంటే భవిష్యత్తును మార్చుకోవచ్చని పేర్కొంటూ, చిన్న కుటుంబాల నుంచి ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందించారు. మైనారిటీలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను తొలగించేందుకు గతంలో ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి విజయవంతం కాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా మైనారిటీ వర్గాలకు కూడా గణనీయమైన ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1తో పాటు పలు ఉద్యోగ నియామకాలు సక్రమంగా జరగలేదని సీఎం విమర్శించారు. గ్రూప్-1 పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అర్హత, నైపుణ్యం కలిగిన వారిని సభ్యులుగా నియమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌తో పాటు నిపుణులతో సంప్రదింపులు జరిపి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేశామని సీఎం తెలిపారు. పరీక్షలు, ఉద్యోగ నియామకాలను అడ్డుకునేందుకు అనేక అవరోధాలు ఎదురైనప్పటికీ, అభ్యర్థులను కుటుంబ సభ్యులుగా భావించి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపరంగా పోరాడి నియామక ప్రక్రి యను పూర్తి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, టీజీఎంఆర్ఈఐఎస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

 

We must work for ‘Telangana Rising’.