Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 6:17 pm Posted by : ramakrishna

సంపూర్ణ సమానత్వ సమాజ స్థాపనకై ఉద్యమించాలి

 

. . . జాతీయోద్యమ వీరుల స్మారక వారోత్సవాలు విజయవంతం చేయాలని పీడీఎస్ యు – పీవైఎల్ పిలుపు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

భగత్ సింగ్ కలలుగన్న సంపూర్ణ సమానత్వ సమాజ స్థాపనకై ఉద్యమించాలని పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్ అన్నారు. దేశ స్వాతంత్రం కోసం ఉరికొయ్యని ముద్దాడిన నిజమైన దేశభక్తులు షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుక్ దేవుల 95 వ వర్ధంతి గోడ ప్రతులను పీడీఎస్ యు – పీవైఎల్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యు – పీవైఎల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కర్క గణేష్, ఎల్. అనిల్ కుమార్, సాయిబాబా, డి. నవీన్ కుమార్ లు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, భారత స్వాతంత్రం కొరకై షహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు పోరాడారన్నారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్రం, దోపిడీ లేని సమాజం కోసం కలలు గంటూ వీర మరణం పొందారని పేర్కొన్నారు. కానీ నేటి స్వాతంత్ర భారత దేశంలో కుల, మత, ఆర్థిక అసమానతలు పెరిగిపోయి కార్పొరేట్, పెట్టుబడిదారులకు దేశ ఆర్థిక వ్యవస్థను పాలకులు తాకట్టు పెట్టారన్నారు. బిజెపి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటూనే విదేశీ వస్తువులను దిగుమతి చేస్తుందన్నారు. స్వాతంత్ర్య యోధుల పోరాట స్ఫూర్తితో పీడీఎస్ యు – పీవైఎల్ సంఘాలు ఈ నెల 23 నుండి 30 వరకు జాతీయోద్యమ వీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తుందన్నారు. వారోత్సవాలలో విద్యార్థి, యువత, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కే. అశుర్, ఎండీ. నసీర్, నితిన్, సహాయ కార్యదర్శులు కార్తీక్, సృజన్, జిల్లా నాయకులు బన్నీ, పీవైల్ నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ్, శాంతి కుమార్, నగర నాయకులు కిరణ్, రవి, నవీన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.