Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 7:36 pm Posted by : ramakrishna

కార్మిక హక్కుల సాధనకై ఉద్యమించాలి

 

. . . టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

మేడే పోరాట స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధనకై, యుద్ధాలకు వ్యతిరేకంగా, పెరుగుతున్న శ్రమదోపిడికి వ్యతిరేకంగా ఉద్యమించాలని టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్ అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లీలోని శ్రామిక భవన్ లో శనివారం 140 వ మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1886 లో చికాగో నగరంలో 8 గంటల పనిదినాల అమలు కోసం, పనికి తగ్గ వేతనంకై, పెట్టుబడిదారుల శ్రమదోపిడికి వ్యతిరేకంగా పోరాడిన రోజే మేడే అని అన్నారు. ఆనాడు కార్మిక నాయకుల త్యాగం, వారి పోరాట ఫలితమే నేడు ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని దినం అమలవుతుందన్నారు. కార్మిక వర్గం సాధించుకున్న కార్మిక హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తున్నదన్నారు. అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. పశ్చిమాసియా దేశాలలోని ఆయిల్ సంపదపై కన్నేసిన అమెరికా సామ్రాజ్యవాద దేశం ఇజ్రాయిల్ తో జతకట్టి ఇరాన్ పై యుద్దం చేస్తుందన్నారు. ఈ యుద్ధ ప్రభావం వల్ల దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి పేద, మధ్యతరగతి ప్రజలపై, ముఖ్యంగా కార్మికవర్గంపై భారాలు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా కార్యదర్శులు ఎం.సుధాకర్, ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్ జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లేష్, డి.కిషన్  కోశాధికారి సాయరెడ్డి జిల్లా నాయకులు కిరణ్, రవి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.