- రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని రూరల్ మండలం సారంగాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “గ్రామస్థులు ఐకమత్యంతో హనుమాన్ ఆలయ నిర్మాణం చేపట్టిన తీరు అభినందనీయమైనది” అని అన్నారు. అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలు ఆయుష్షు, ఆరోగ్యం, సుఖశాంతులతో ఉండాలన్నారు. మందిర నిర్మాణానికి కావలసిన ఇసుకను స్థానికులు కోరిన వెంటనే తాను ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. గ్రామ అభివృద్ధి పరంగా ఇప్పటికే అనేక పథకాలు చేపట్టామని, అందులో భాగంగా సారంగాపూర్ గ్రామానికి 100 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, కోటిరూపాయల నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో, సర్వే నంబర్ 101 భూమి సమస్య భూభారతి ద్వారా పరిష్కరించనున్నట్లు, అలాగే కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నట్లు తెలిపారు. గ్రామంలో రోడ్డు సమస్యపై వచ్చిన వినతిని కూడా పరిశీలించామనీ, త్వరలోనే నిధులు మంజూరు చేసి రహదారి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. “సారంగాపూర్ గ్రామానికి సంబంధించి ఏ సమస్య అయినా నేరుగా నా దృష్టికి తీసుకురావాలి. తగిన చర్యలు వెంటనే తీసుకుంటాను” అని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.అనంతరం ఎమ్మెల్యే కు గ్రామస్తులు సన్మానం చేశారు. తరువాత అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ముప్పగంగారెడ్డి, రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉమ్మాజీ నరేష్, కాంగ్రెస్ నాయకులు కుంచపు నగేష్, శ్రీనివాస్ గౌడ్, అశోక్, సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామస్తులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
