Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 6:31 pm Posted by : ramakrishna

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి

 

. . . నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెన్షన్ కాదు… మరింత కఠిన చర్యలు

 

. . . అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టీకరణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రస్తుత వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో ఎవరైనా కావాలని నిర్లక్ష్యానికి తావిస్తే, కేవలం సస్పెన్షన్ తోనే సరిపెట్టకుండా బాధ్యులైన వారిపై మరింత కఠిన చర్యలు చేపడతామని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇటీవల పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఎస్జీటీ ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరును కలెక్టర్ ప్రస్తావిస్తూ, పై విధంగా హెచ్చరికలు చేశారు. ఎంతో బాధ్యతాయుతమైన విధుల్లో కొనసాగుతూ, విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, నిర్లక్ష్యానికి తావిచ్చే వారిపై తప్పనిసరిగా కఠినమైన చర్యలు ఉంటాయని కరాఖండీగా తేల్చి చెప్పారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పక్కాగా వ్యవహరించాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ తో పాటు సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసిల్దార్లు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని సూచించారు.

 

Waterlogging problems should be prevented.

 

పరీక్షా కేంద్రాలలోకి సిబ్బంది ఎవరూ సెల్ ఫోన్లు తీసుకెళ్ళకుండా గట్టి పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు. ప్రతి నివాస ప్రాంతానికి ప్రజల అవసరాలకు సరిపడా శుద్ధి జలాలు సరఫరా అయ్యేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎం.పీ.ఓలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. అవసరమైన చోట చిన్న చిన్న మరమ్మతులను వెంటనే చేపట్టాలని, పైప్ లైన్ లీకేజీలు వంటి వాటిని యుద్ధప్రాతిపదికన నివారించాలని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో కుళాయి కనెక్షన్లు ఉండాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. తాగునీటి సరఫరా తీరుతెన్నులపై మండల స్పెషల్ ఆఫీసర్లు నిశిత పరిశీలన జరపాలని, ముఖ్యంగా ఎంపీడీఓలు, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం తాగునీటి సరఫరాను పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి సాధించేలా చొరవ చూపాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకునేలా లబ్దిదారులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Waterlogging problems should be prevented.