Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 5:15 pm Posted by : ramakrishna

వరద కాలువలో నీళ్లు నింపి రైతులకు సాగునీరు అందించాలి

 

. . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

వేల్పూర్, బతుకమ్మ :

 

నియోజకవర్గంలోని గాండ్లపేట్ వద్ద వరద కాలువ మరమ్మత్తు పనులు దాదాపు పూర్తయిన నేపథ్యంలో, మిగిలిన చిన్నపాటి సమస్యలను వెంటనే పరిష్కరించి రివర్స్ పంపింగ్ ద్వారా కాలువను నింపి ఆయకట్టు గ్రామాల రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) లాల్ సింగ్‌తో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడారు. వరద కాలువ మరమ్మత్తు పనులు పూర్తయినప్పటికీ, సబ్ కాంట్రాక్టర్ల మధ్య నెలకొన్న స్వల్ప వివాదం వల్ల కొన్ని పనులు నిలిచిపోయినట్లు ఈఈ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ప్రశాంత్ రెడ్డి, ఇరు వర్గాల కాంట్రాక్టర్లతో వెంటనే చర్చించి ఒకటి, రెండు రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా పనులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని, అవసరమైతే తాను స్వయంగా ప్రధాన కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, వచ్చే వారం రోజుల్లోనే రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువలో నీటిని నింపేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వరద కాలువపై ఉన్న తూముల ద్వారా ఆయకట్టు గ్రామాల చెరువులను నింపి రైతులకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని, ఈ కాలువే ఆ గ్రామాల రైతులకు ప్రధాన ఆధారమని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ఉన్నతాధికారులకు వెంటనే నివేదికలు పంపి అవసరమైన అనుమతులు పొందాలని ఈఈని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాల్ సింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ)లో 15.2 టీఎంసీల నీటి నిల్వ ఉందని, ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి 14 గేట్లు ఎత్తి 5.2 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎస్సారెస్పీ నుంచి లేదా రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువను పూర్తిగా నింపి, ఈ సాగు సీజన్‌లో రైతులకు ఎలాంటి సాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.