- ఆందోళనలో అన్నదాతలు..
బాన్సువాడ, బతుకమ్మ : నిజాంసాగర్ చివరి ఆయకట్టు తడారిపోతోంది.. వేసవికి ప్రారంభంలోనే నీరందక తల్లడిల్లుతోంది. తలాపున నీళ్లున్న తమ పొలాలకు పూర్తిగా నీళ్లందక కర్షకుల కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి. కాలువల ద్వారా సరిపడా నీరు రాకపోవడం.. ఎగువభాగంలో మోటార్లు పెట్టి నీళ్లు తోడేస్తుండడం కారణంగా.. చివరిగా ఉన్న భూములన్నీ బీళ్లుగా మారుతున్నాయని రైతన్న ఆవేదన చెందుతున్నారు. అధికారుల పర్యవేక్షణాలోపం తమకు శాపంగా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిజాంసాగర్ నిండుకుండలా ఉన్నప్పటికీ చివరి ఆయకట్టుకు నీరందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. పంటల కోసం ఇప్పటికే నాలుగు విడతల్లో 7.94 టీఎంసీల నీటిని విడుదల చేశారు.
- అధికారుల నిర్బంధం..
అధికారుల పర్యవేక్షణాలోపంతోనే ఇదంతా జరుగుతోందని బోధన్ మండల రైతులు ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులను సైతం నిర్భందించారు. ప్రధాన కాలువ పరిధిలోని వర్ని, చందూర్, జాకోరా, రుద్రూర్, కోటగిరి, బోధన్ ప్రాంతాల్లోని పొలాలకు నీళ్లు మొత్తానికే రావట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన ఉన్న రైతులు ఎక్కువ నీటిని వినియోగించుకుంటున్నారని వారంటున్నారు.
- ఎమ్మెల్యే పోచారం స్పందించడంతో..
పంటలక నీరు అందడం లేదని రైతులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన పంటలకు నీరందేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు రాత్రివేళ కాలువల వెంబడి తిరుగుతూ పర్యవేక్షిస్తున్నారు.
- మరో రెండు విడతలు..
ఆయకట్టుకు మొత్తం ఆరు విడతల్లో 11టీఎంసీల నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే నాలుగు విడతల్లో 7.94 టీఎంసీల నీటిని వదిలారు. ఈ లెక్కన మరో రెండు విడతల్లో మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ మూడు టీఎంసీలతో పంటలు గట్టెక్కే పరిస్థితి లేదని రైతులు చెందుతున్నారు.
- మోటార్లు పెట్టడంతోనే ఇబ్బందులు..
నిజాంసాగర్ ప్రధాన కాలువకు ఒక పక్కన మోటార్లు ఏర్పాటు చేసి కొందరు రైతులు అక్రమంగా నీటిని తరలిస్తున్నారు. దీంతో చివరి ఆయకట్టు వరకు నీరు చేరడం లేదు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 17.80 టీఎంసీలకు గాను 8.30 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
- చర్యలు తీసుకుంటాం..
- శ్రీనివాస్, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్.
ఆయకట్టు కింద సాగు చేసిన పంటలకు నీరు అందిస్తున్నాం. దాదాపు 20 వేల ఎకరాలకు అక్రమంగా నీటిని తరలిస్తున్నారు. దీంతో చివరి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఆయకట్టు కింద ప్రతి ఎకరాకు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.