. . . బాన్సువాడ ఆర్డీఓకు రైతుల వినతి
కామారెడ్డి, బతుకమ్మ :
రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ సోమవారం రైతులు బాన్సువాడ ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ కిషోర్ యాదవ్, బాన్సువాడ మాజీ జెడ్పీటీసీ కొత్తకొండ భాస్కర్, దుర్కి గ్రామ సర్పంచ్ ఉడుతల ఉమా నారాగౌడ్ ఆధ్వర్యంలో పలువురు రైతులు కలిసి ఆర్డీఓను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికే సాగు చేసిన పంటలు నీటి కొరతతో ఎండిపోయే ప్రమాదం ఉందని, రైతుల ఆర్థిక పరిస్థితి మరింత దెబ్బతినకుండా ఉండాలంటే నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిగణించి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హైమద్, శంకర్‌తో పాటు పలువురు రైతులు పాల్గొని, సాగునీటి విడుదలకు మద్దతుగా బాన్సువాడ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.