. . . చోరిల్లో వాటా ఇవ్వాలని ఒప్పందం
. . . దొంగకు బెయిల్ ఇప్పించిన వార్డర్
. . . బెయిల్ పై విడుదలై భారీ చోరి
. . . సిద్దిపేట్ పోలీసులకు చిక్కిన దొంగ
. . . విధులకు వార్డర్ డుమ్మా . . . సస్పెన్షన్ చేసిన అధికారులు
. . . ఏఆర్ కానిస్టేబుల్ ప్రమేయంపై విచారణ
. . . నిజామాబాద్ సెంట్రల్ జైలులో సంచలనం
నిజామాబాద్, బతుకమ్మ :
దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అనేది అప్పుడప్పుడు అనుకునే మాట. దొంగలు పోలీసులు ఒకటేనని కొన్ని రోజుల క్రితం వరకు ఉన్న మాటే. కానీ ఇప్పుడు దొంగలు, జైలు అధికారులు, సిబ్బంది మిలాఖత్ అయ్యారంటే ఔననే చెప్పాలి. ఎందుకంటే అటువంటి అరుదైన ఘనతను నిజామాబాద్ సెంట్రల్ జైలు దక్కించుకుంది. దొంగతనం కేసులో నిజామాబాద్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బిక్షపతితో జైలు వార్డర్ గోపాల్ మిలాఖత్ అయిన వ్యవహరంను సిద్దిపేట పోలీసులు భగ్నం చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన బిక్షపతి పేరుకు ఎలక్ట్రిషియన్. కానీ దొంగతనాలే ప్రవృత్తిగా ఎంచుకుని చాలా ప్రాంతాల్లో చోరిలకు పాల్పడ్డారు. కొద్ది రోజుల క్రితం దొంగతనం కేసులో అరెస్టు అయిన బిక్షపతి నిజామాబాద్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అక్కడ జైలు వార్డర్ గా పని చేసే గోపాల్ తో డీల్ కుదుర్చుకున్నాడు. జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత చేసే చోరిల్లో వాటా ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. బెయిల్ కోసం ఏకంగా రూ.70 వేలు వసూల్ చేసి జైలు నుంచి విడుదలయ్యేందుకు ఏకంగా వార్డర్ బిక్షపతికి బెయిల్ ఇప్పించాడు. బెయిల్ పై విడుదలైన బిక్షపతి కొన్ని రోజులకే సిద్దిపేట్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీ చోరికి పాల్పడ్డారు. భారీ చోరి కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు చర్లపల్లి జైలు సమీపంలో ఈ నెల 13న పట్టుకున్నారు. పోలీసుల విచారణలో జైలు వార్డెన్ తో పాటు ఓ ఏఆర్ కానిస్టేబుల్ సహకారంతోనే బిక్షపతి జైలు నుంచి విడుదలైనట్లు సిద్దిపేట్ పోలీసు కమిషనర్ రష్మీ పెర్మల్ ప్రకటించారు. బిక్షపతి పోలీసులకు చిక్కిన నాటి నుంచి జైలు వార్డర్ గోపాల్ విధులకు హాజరుకావడం లేదు. సిద్దిపేట పోలీసుల నివేదిక ఆధారంగా జైళ్ళ శాఖ వార్డర్ గోపాల్ ను సస్పెండ్ చేసింది. పోలీసు శాఖలో పని చేసే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎవరనే చర్చ జరుగుతుంది.
రాష్ట్రంలో చర్లపల్లి తర్వాత అతిపెద్ద జైలుగా నిజామాబాద్ జైలు రికార్డుల్లో నమోదై ఉంది. నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ వద్ద ఎకరాల్లో నిర్మించిన జైలులో దాదాపు 1500 నుంచి 1800 మంది ఖైదీలు ఉన్నారు. అందులో కొందరు శిక్ష అనుభవిస్తున్న వారయితే మరికొందరు అండర్ ట్రయల్ ఖైదీలు. నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఓపెన్ ఎయిర్ జైలు కూడా ఉంది. ఒకప్పుడు వరంగల్ లో ఉన్న మరమగ్గల యూనిట్ ను నిజామాబాద్ సెంట్రల్ జైలుకు తరలించడంతో అక్కడ చాలా మంది ఖైదీలకు శిక్షణ ఇస్తున్నారు. సెంట్రల్ జైలు అనుబంధంగా ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంది. సెంట్రల్ జైలు నిర్మాణం మొదలుకుని ప్రస్తుతం వరకు వివాదాల్లోనే ఉందని చెప్పాలి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా నుంచి సారంగాపూర్ తరలించిన నాటి నుంచి వివాదాలు వెంటాడుతున్నాయి. జైలు విస్తరణలో జరిగిన మొరం బహిరంగంగా అమ్ముకున్నారనేది తొలుత వచ్చిన ఆరోపణ దానిపై జైళ్ళ శాఖ విచారణ చేయలేదన్నది ప్రధాన అభియోగం.

నిజామాబాద్ సెంట్రల్ జైలులో గతేడాది జరిగిన వివాదం రాష్ట్రంలోనే సంచలనం రేపింది. నిజామాబాద్ జైలులో ఖైదీల్లో కొందరు మత్తు పదార్థాలకు అలవాటుపడగా 2025 వరకు దొడ్డిదారిన, రహస్యంగా వారికి చేరేవనే ఆరోపణలున్నాయి. జైలులో గంజాయికి బానిసలైన వారి కోసం కొందరు జైలు ప్రహారి నుంచి విసిరేసిన గంజాయి కోసం గొడవ పడ్డారు. 2025 ఆగస్టులో గంజాయి కోసం ఖైదీలు గొడవపడగా వారిని చితకబాదిన వ్యవహరం రాష్ట్ర జైలు చరిత్రలోనే ఘనతకెక్కింది. ఎందుకంటే ఈ ఘటనకు బాధ్యులను గుర్తించేందుకు సెర్చ్ కమిటీ సెంట్రల్ జైలును జల్లెడ పట్టిన విషయం విధితమే. ఈ వ్యవహరంలో ఒక డిప్యూటీ జైలర్ సస్పెన్షన్ కు గురి కాగా మరొకరు బదిలీ అయ్యారు. ఏకంగా జైలు సూపరింటెండెంట్ నే విధుల నుంచి తాత్కాలికంగా తప్పించారు. ఈ వ్యవహరంలో కొందరు ముదురు ఖైదీలను ఇతర జైళ్ళకు తరలించిన చరిత్ర ఉంది. అయినప్పటికీ నిజామాబాద్ సెంట్రల్ జైలులో సంస్కరణల సంగతి దేవుడెరుగు కానీ వివాదాలు మాత్రం వీడడం లేదు. జైళ్ళ శాఖలో పని చేస్తున్న కొందరు అవినీతి అధికారులు అక్రమంగా సంపాదన కోసం దొడ్డిదారులు వెతుకుతున్నారని దొంగతో వార్డర్ మిలాఖత్ వ్యవహరం బట్టబయలు చేసింది. జైళ్ళ శాఖ గతేడాది నిజామాబాద్ పై ప్రత్యేకంగా నజర్ వేసిన ఏ మాత్రం మార్పు లేకపోవడం గమనార్హం.
