Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 8:13 pm Posted by : ramakrishna

బీసీ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ దాడి

 

. . . కర్రతో కొట్టినట్లు విద్యార్థుల ఆరోపణలు.. శరీరాలపై దెబ్బల గుర్తులు

 

. . . ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని తల్లిదండ్రుల డిమాండ్

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్ వార్డెన్ కల్పలత తమపై కర్రతో దాడి చేసినట్లు సుమారు పది మంది విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తాము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పినప్పటికీ వార్డెన్ వినకుండా కర్రతో ఇష్టానుసారంగా కొట్టినట్లు ఆరోపించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థుల శరీరాలపై దెబ్బల గుర్తులు కనిపించినట్లు సమాచారం.

. . . తల్లిదండ్రుల్లో ఆందోళన

హాస్టల్‌లో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను క్రమశిక్షణ పేరుతో కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హాస్టల్‌ను పరిశీలించాలని కోరుతున్నారు. విద్యార్థులపై దాడి జరిగిందన్న ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.