- ఆరు గ్యారెంటీల్లో నుంచి ఏ ఒక్క గ్యారెంటీని పూర్తిగా అమలు చేయలేదు
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి విమర్శ
- కాంగ్రెస్ ఏడాది పాలనపై ‘చార్జిషీట్’ విడుదల
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్యారెంటీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఆధ్వర్యంలో రూపొందించిన ‘చార్జిషీట్’ ను బుధవారం నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వంద రోజుల్లో 6 గ్యారెంటీలు, 66 వాగ్దానాలు అని మ్యానిఫెస్టో రూపొందించి మోసం చేశారన్నారు. వరంగల్, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌లలో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మెుదలు పెట్టిందని, జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టు నిర్మాణంపై కసరత్తు ఎందుకు మొదలుపెట్టడం లేదని ప్రశ్నించారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెరిపిస్తారన్నారు. జిల్లాలో 2,75,000 మంది రైతులు ఉండగా, 70వేల మందికి మాత్రమే రుణమాఫీ చేశారని, ఇంకా రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నధాన్యానికి మాత్రమే ఇస్తున్నారని, రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. రైతు కూలీలకు సాయం ఇవ్వడం లేదన్నారు. మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైన్ పై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గొపిడి స్రవంతి, గద్దె భూమన్న, ఇప్పాకాయల కిషోర్, బద్దం కిషన్, స్వామి యాదవ్, పద్మరెడ్డి, కొండ ఆశన్న, పుట్ట వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.
