Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 6:52 pm Posted by : ramakrishna

ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలి

 

. . .  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి

 

. . . జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, ఇతర అంశాలపై సీ.ఈ.ఓ సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, 2002 వివరాలతో, ప్రస్తుత వివరాలు సరిపోలుస్తూ మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. బూత్ లెవెల్ అధికారులు (బిఎల్ఓ లు) తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో తిరుగుతూ, ఈ ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలన్నారు. రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకుని, మ్యాపింగ్ ప్రక్రియకు సహకారం అందించేలా కృషి చేయాలని అన్నారు. తప్పిదాలకు తావులేకుండా నిర్ణీత గడువులోగా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా రోజువారీగా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, 2002 ఓటర్ లిస్టు ప్రకారం కొత్త ఓటర్ లిస్టు మ్యాపింగ్ త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో కొంత జాప్యం జరిగిందని, ప్రస్తుతం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమై ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ పై సూచనలు చేశారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాలలో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్ చేసుకోని వారిని గుర్తిస్తూ, వెంటనే మ్యాపింగ్ పూర్తి చేసేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, కిరణ్మయి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Voter list mapping should be completed expeditiously.