Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 7:48 pm Posted by : ramakrishna

పంచాయతి ఎన్నికలలో పోటేత్తిన ఓటర్

. . . మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో మహిళలదే పైచేయి
. . . పురుషుల కన్నా మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగం
. . . నిజామాబాద్ జిల్లాలో 81.31 శాతం ఓటింగ్ నమోదు
. . . కామారెడ్డి జిల్లాలో 79.40 శాతం పోలింగ్
నిజామాబాద్, బతుకమ్మ :

చాలా రోజుల తర్వాత జరుగుతున్న పంచాయితీ ఎన్నికలు మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. కామారెడ్డి జిల్లాలో రెండు తాండలు ఎన్నికలను బహిష్కరించిన ఘటనలు మినహా ఎలాంటి చెదురుమదురు సంఘటనలు జరుగకుండానే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉమ్మడి జిల్లాలో మహిళ ఓటర్లే అత్యధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోటెత్తారు. ఉమ్మడి జిల్లాలో 300పైచిలుకు సర్పంచ్ లు, వార్డు మెంబర్ల కోసం జరిగిన ఎన్నికలకు మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కును వినియోగిస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఓటింగ్ జరుగగా ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహించారు. తొలుత వార్డు సభ్యులకు, తర్వాత సర్పంచ్ పదవులకు కౌంటింగ్ నిర్వహించారు. వార్డు సభ్యుల ఎన్నికల ఫలితాల తర్వాత ఉప సర్పంచ్ లను అప్పటికప్పుడే ఎన్నుకున్నారు.

Voter contesting in Panchayat elections
నిజామాబాద్ జిల్లాలో 155 జీపీలలో, 1642 వార్డు సభ్యుల కోసం ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచి ప్రారంభమైన ఎన్నికల్లో మొత్తం 2,42,723 మంది ఓటర్లకు గాను 11 మండలాల్లో 1,97,492 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో 81.37 శాతం ఓటింగ్ నమోదైంది. జిల్లాలోని 11 మండలాల్లో 155 జీపీల కోసం జరిగిన ఎన్నికల్లో 1,14,959 మంది పురుష ఓటర్లకు గాను 92,210 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల ఓటింగ్ శాతం 81.21గా నమోదైంది. మొదటి విడతలో 1,27,757 మంది మహిళ ఓటర్లకు గాను 1,05,282 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకుని పురుషుల కన్నా అధికంగా 82.41 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Voter contesting in Panchayat elections

కామారెడ్డి జిల్లాలో 157 జీపీలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగగా కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఉండడంతో కొంత ఆలస్యమైంది. తర్వాత మధ్యాహ్న భోజనం విరామం తర్వాత కౌంటింగ్ ప్రారంభమైంది. జిల్లాలోని 1457 పోలింగ్ స్టేషన్ లలో 2,42,913 మంది ఓటర్లకు గాను 1,92,870 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో మొత్తంగా 79.40 శాతం ఓటింగ్ జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. పురుషులు 115535 మంది పురుషులకు గాను 88642 మంది ఓటు హక్కును వినియోగించగా పురుషుల ఓటింగ్ శాతం 76.72 శాతం నమోదైంది. మహిళలు 1,27,375 మందికి గాను 1,04,228 మంది ఓటు హక్కును వినియోగించుకోగా ఓటింగ్ శాతం 81.13 శాతం గా నమోదైంది.