Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 5:39 pm Posted by : ramakrishna

అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు ఆదర్శంగా మారతాయి

 

. . . గ్రామాలకు వచ్చే ప్రతి రూపాయి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి

 

. . . అలసత్వం, నిబంధనల ఉల్లంఘనపై ఉపేక్ష ఉండదు

 

. . . స్వయం సమృద్ధి గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం

 

. . . గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల రాష్ట్రస్థాయి సమీక్షలో మంత్రి సీతక్క

 

. . . ఏడు గంటల పాటు సాగిన సమావేశం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

గ్రామాల అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు నిర్మించడం మాత్రమే కాదని, గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే అసలు అభివృద్ధి అని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గ్రామాలను స్వయం సమృద్ధిగా, నగరాలకు తీసిపోని మౌలిక వసతులతో తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీఆర్‌డీఓలు, డీపీఓలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, మిషన్ భగీరథ, సెర్ప్, ఉపాధి హామీ పథకం తదితర విభాగాల అధికారులతో మంత్రి సీతక్క సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్యా దేవరాజన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏడు గంటల పాటు సాగిన సమావేశంలో శాఖల వారీగా పనుల పురోగతి, భవిషత్తు లక్ష్యాల ను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో సుమారు 1.35 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, ఏటా రూ.34 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చవుతున్నాయని గుర్తుచేశారు. ఇంత భారీ యంత్రాంగం, నిధులు ఉన్నప్పటికీ గ్రామాల రూపురేఖలు ఆశించిన స్థాయిలో మారకపోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఏ శాఖకు ఆ శాఖ విడివిడిగా పనిచేస్తే ఫలితాలు రావు. జిల్లా స్థాయిలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు ఒకే టీమ్‌గా పనిచేయాలి. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలి. ప్రతి గ్రామానికి అవసరాలు, వనరులు, సమస్యలను గుర్తించి వాటి ఆధారంగా కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. తెలంగాణ గ్రామాల్లో అపారమైన సహజ, మానవ వనరులు ఉన్నాయని, వాటిని సక్రమంగా వినియోగిస్తే గంగదేవిపల్లి వంటి ఆదర్శ గ్రామాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్మించవచ్చని మంత్రి అన్నారు. వచ్చే రెండు నెలల్లో గ్రామాల వారీగా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి అమలుకు తీసుకురావాలని అధికారులకు గడువు విధించారు. గ్రామాలకు వచ్చే ప్రతి రూపాయి ప్రజల ప్రయోజనాలకే ఖర్చు కావాలని స్పష్టం చేసిన మంత్రి, “ఒక్కో నీటి బొట్టును ఎలా పొదుపుగా వాడుకుంటామో, గ్రామాలకు వచ్చే ప్రతి రూపాయిని కూడా అంతే జాగ్రత్తగా వినియోగించాలి. ప్రజల డబ్బును వృథా చేయడానికి ఎవరికీ హక్కు లేదన్నారు. స్థానిక సంస్థల నిధుల వినియోగంపై మాట్లాడుతూ, కొన్నిచోట్ల గ్రామసభలు నిర్వహించకుండా నిధులు ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు నిధుల వినియోగంపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. “నేను ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాను. జిల్లాల్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటాను. నిర్లక్ష్యం, అలసత్వం, బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మంత్రి అధికారులను హెచ్చరించారు. సమీక్షలో ఉపాధి హామీ పథకం అమలు, కూలీలకు పనిదినాల కల్పన, పెండింగ్ మెటీరియల్ బిల్లుల చెల్లింపులు, అంగన్‌వాడీ భవనాలు, మహిళా శక్తి భవనాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల నిర్మాణాలు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు, పారిశుధ్య నిర్వహణ, ఇంటి పన్నుల వసూళ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాల సాధన, గ్రామ కార్యదర్శుల హాజరు తదితర అంశాలపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు.

 

Villages will become model villages only if all departments work in coordination.

 

. . . జల సంరక్షణే భవిష్యత్ భద్రత

వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకొని జల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. చెరువులు, కుంటలు, బావులు, వాగులను పరిరక్షించడం గ్రామీణాభివృద్ధిలో అత్యంత కీలకమని అన్నారు. “చెరువును కాపాడుకుంటే ఊరిని కాపాడుకున్నట్టే. పాత బావులను గుర్తించి పునరుద్ధరించాలి. బావుల చుట్టూ రక్షణ గోడలు నిర్మించి ప్రమాదాలను నివారించాలి. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంటకుంట, ప్రతి ఊరిలో ఊటకుంట ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన ‘జలసిరి’ అవగాహన పోస్టర్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు.

. . . ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు చేరాలి

వర్షాకాలంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మిషన్ భగీరథ అధికారులకు సూచించిన మంత్రి, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు సహా ప్రతి ఇంటికి నిరంతరాయంగా రక్షిత మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిషన్ భగీరథ నీటి నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

. . . ఆదివాసి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి

ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మిస్తున్న రహదారులకు కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతుల సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. “పట్టణాల్లో స్కైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తుంటే అటవీ గ్రామాల్లో కనీసం బీటీ రోడ్డు వేయడానికీ అనుమతులు రావడం లేదు. కేంద్రం నిధులు మంజూరు చేసిన తర్వాత కూడా అనుమతుల పేరుతో అడ్డంకులు సృష్టించడం వల్ల ఆదివాసి గిరిజన గ్రామాలు ఇంకా వెనకబాటులోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 28, 29 తేదీల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో జరగనున్న సమావేశంలో రాష్ట్ర సమస్యలను ప్రస్తావించనున్నట్లు తెలిపారు. పిఎంజిఎస్ వై కింద అటవీ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, కేంద్రంతో సంప్రదింపులు  జరిపేందుకు  శాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు

. . . మహిళా సంఘాలే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక

మహిళా సంఘాల బలోపేతం, బ్యాంకు లింకేజీల పెంపు, మహిళలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సెర్ప్ అధికారులను మంత్రి ఆదేశించారు. మహిళల ఆర్థిక సాధికారత పెరిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. సమావేశం ముగింపులో మంత్రి సీతక్క మాట్లాడుతూ, “మనందరిదీ గ్రామీణ నేపథ్యమే. గ్రామీణ ప్రజల కష్టాలు మనకు తెలుసు. కాబట్టి గ్రామాల్లో సమస్యలు తలెత్తకముందే పరిష్కారాలు చూపాలి. తెలంగాణ గ్రామాలను దేశానికి ఆదర్శంగా నిలబెట్టే బాధ్యత మనందరిదని అధికారులకు పిలుపునిచ్చారు.

 

Villages will become model villages only if all departments work in coordination.