. . . ఘనంగా అమ్మవార్ల ఊరేగింపు
. . . బారులు తీరిన భక్తులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలో ఊర పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఊర పండుగలో భాగంగా గ్రామదేవతలను ఉదయం నుంచి ప్రజలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నగరం భక్తితో పులకరించి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గ్రామ దేవతలకు నీరాజనాలు పలుకుతూ నగరవాసులు భక్తిశ్రద్ధలతో ఊర పండుగను జరుపుకున్నారు. ఊరంతా చల్లగా చూడు తల్లి అంటూ భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని వేడుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు పండాలని సుఖ సంతోషాలతో ఉండాలని దుష్ట శక్తులు దరిచేర వద్దని వేడుకుంటూ నగర ప్రజలు గ్రామ దేవతలను పూజించారు.

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర రోజునే పండుగ నిర్వహించడం ఆనవాయితీ. ఊర పండగ నిర్వహణ కమిటీ అయిన సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఖిల్లా రఘునాథ్ ఆలయం శారదాంబా గద్దె వద్ద గ్రామదేవతలను ఉంచి పసుపు కుంకుమ చెవి పోగులు ఆభరణాలతో విశేషంగా అలంకరించి పూజలు చేశారు. సర్వ సమాజ్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ కార్యదర్శి బంటు రాజేశ్వర్ కన్వీనర్ రామర్తి గంగాధర్ కుల సంఘాల పెద్దలు పూజలు నిర్వహించారు.

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గ్రామదేవతల ఊరేగింపు గాజుల పేట్ చౌరస్తా మీదుగా పెద్ద బజార్ చౌరస్తా వరకు చేరుకుంది .అడుగడుగున భక్తులు తొట్టెల కింది నుంచి వెళ్లాలని బారులు తీరారు. పెద్ద బజార్ చౌరస్తా నుంచి రెండు బృందాలుగా విడిపోయి డప్పులు, పోతరాజుల విన్యాసాలు, మహిళల పూనకాలతో ఒక బృందం పౌడ లమ్మ నల్ల పోచమ్మ ఆడెల్లి పోచమ్మ పెద్దమ్మ పులి రాట్నం ఆసు తొట్లే లతో ఊరేగింపు దుబ్బ వైపు వెళ్ళింది. రెండో బృందం సిర్నాపల్లి గడి గోల్ హనుమాన్ చౌరస్తా మీదుగా వినాయక నగర్ ఐదు చేతుల పోచమ్మ మత్తడి పోచమ్మ మహాలక్ష్మమ్మ లతో వెళ్ళింది. గాజుల్ పేట్ వివేకానంద చౌరస్తా వద్ద సరి ని పంపిణీ చేశారు. సరి కోసం భక్తులు ఎగబడ్డారు. సరిని నాలుగు గుల్లలు గా విభజించారు.

ఒక గుల్ల దుబ్బ వైపు రెండవది వినాయక్ నగర్ మూడవది ఎల్లమ్మ గుట్ట నాలుగవది కంఠేశ్వర్ ప్రాంతాలకు సరి చల్లుకుంటూ వెళ్లారు. ఊర పండుగ సందర్భంగా వాడవాడలా యువకులు ఉత్సాహంగా పాల్గొని గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. అమ్మవారి గద్దెల వద్ద పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. యువత కేకలు వేస్తూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు పూనకాలతో అమ్మవార్ల ప్రతిరూపమైన తొట్టెల కింద నుంచి వెళ్లేందుకు భక్తులు బారులు తీరారు. పలు వీధి చౌరస్తాలో ప్రజలు మేకలు గొర్రెలను కోళ్లను బలి ఇస్తూ కల్లు సాకలు పోస్తూ కొబ్బరికాయలు కొడుతూ మొక్కులు తీర్చుకున్నారు. పాడిపంటలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని వేడుకుంటూ గ్రామ దేవతలను నగర ప్రజలు భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు.
