. . . నిజం మాట్లాడిన వాళ్లనే బద్నాం చేస్తారా?
. . . వెలుగుమట్ల బాధితుల విషయంలో 17న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేస్తాం.
. . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ :
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా అనే మహమ్మరిని ప్రజలకు మీదకు వదిలిందని, సాధారణంగా హైడ్రా వాళ్లు దేనికి కూడా మాట్లాడారని, కానీ మేము ప్రొటెస్ట్ చేసిన తర్వాత హైడ్రా అఫిషీయల్ ట్విట్టర్ హ్యాండిల్ లో తప్పడు సమాచారంతో 5 వీడియోలు పెట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ మేము ఇప్పటి వరకు రంగనాథ్ కి 6 కంప్లైంట్స్ ను ప్రూఫ్స్ తో ఇస్తే కనీసం ఒక్క చర్య కూడా తీసుకోలేదని, హైడ్రా కేవలం పేదవాళ్ల ఇళ్లను కూల్చుతూ పెద్దవాళ్ల ఇళ్ల జోలికి మాత్రం వెళ్లటం లేదని అన్నారు. మేము మార్చి 3 న ధర్నా చేశామని, కానీ హైడ్రా రాకముందే దీనికి పర్మిషన్లు ఇవ్వటంతో మాకు సంబంధం లేదని ట్విట్టర్ లో పెట్టారని, కానీ మేము ధర్నా చేసిన బిల్డింగ్ కు సంబంధించి 0.37 ఎకరాలు ఆక్రమణ జరిగిందని, 23 మీటర్లు ఎన్ క్రోచ్ అయ్యిందని రంగనాథ్ ఒప్పుకున్నారని పేర్కొన్నారు. మళ్లీ సిగ్గు లేకుండా మేము మార్చి 3 నాడు ధర్నా చేస్తే….హైడ్రా నుంచి వీడియోలు తీసి పెడతారా అని ప్రశ్నించారు. అందుకే చాలా సీరియస్ గా రంగనాథ్ మీద డిఫమేషన్ కేసు వేస్తా అని హెచ్చరించారు. నిజం మాట్లాడితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా అని మీరు గ్రాఫిక్స్ డిజైనర్సా?, కంటెంట్ క్రియేటర్సా? అని మండిపడ్డారు. నాలాను డైవర్షన్ చేయకుండా 3 ఎకరాలు కబ్జా చేశారని, దీంతో మూసీ నది అక్కడ మురుగు కాల్వ మాదిరిగా మారిందని అన్నారు. దాని కారణంగా అక్కడ చాలా బిల్డింగ్ లు వరదలో మునిగిపోయాయని, దీని మీద మాట్లాడితే మాలాంటి వాళ్లను ఈ ప్రభుత్వం బద్నాం చేస్తోందని తెలిపారు. అందరికీ ఒకే రూల్ ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్డింగ్ ను కూల్చాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ రోజు సాయంత్రం వరకు హైడ్రా చేసిన ట్వీట్స్ డిలీట్ చేయకపోతే కోర్టులో కేసు వేస్తానని, తమషాకు మేము ధర్నా చేశామని అనుకుంటున్నారా? ఫ్రూప్ లేకుండా నేను ఏదీ మాట్లాడనని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం, మీరు మొత్తం బోగస్ అని, మీ వద్ద ఫేక్ డిజిటల్ వాసన వస్తోందని మండిపడ్డారు.

మూసీ నది క్లీన్ చేస్తామని ప్రభుత్వం ప్రకటనల మీద ప్రకటనలు చేస్తోందని, కానీ ఈ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్ కు తాకట్టు పెడుతున్నారని ఇది వరకు అసెంబ్లీ సమావేశాల్లోనే జాగృతి చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు కూడా మూసీ ప్రాజెక్ట్ విషయంలో ఏం చేస్తామన్నది స్పష్టత ఇవ్వటం లేదని, ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్ లో ఫేజ్-1 గురించి మాత్రమే చెప్పారని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మోసం ఉందని స్పష్టంగా అర్థమవుతోందని, గతేడాది సెప్టెంబర్ లో ప్రి పీజిబుల్ లో ఫేజ్ వన్ లో 5, 641 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారని, కానీ మొన్నటి ప్రజెంటేషన్ లో మాత్రం 6 వేల 5 వందల నుంచి 7 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారని అన్నారు. అంటే ఆరు నెలల్లోనే దాదాపుగా 1400 కోట్లు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. అసలు ఈ ప్రాజెక్ట్ కారణంగా 3 వేల ఎకరాలు కోల్పోతున్న బాధితులను ఎందుకు పిలవలేదని, వాళ్లతో చర్చించకుండా సీఎం మాత్రం వన్ సైడెడ్ గా మీటింగ్ లో మాట్లాడారని అన్నారు. మన్ కీ బాత్ మోడీ మాట్లాడినట్లుగానే వన్ సైడ్ గా మనకు ఇక్కడ ఉన్న చిన్న మోడీ మాట్లాడుతున్నారని, కానీ భూమి కోల్పోతున్న పేదలకు ఏం చేస్తామన్న దానిపై మాత్రం ఏమీ చెప్పటం లేదని, గతంలో చంద్రబాబు, వైఎస్ ఆర్ కూడా మూసీ ప్రక్షాళన కోసం ప్రయత్నం చేశారని, కేసీఆర్ వచ్చాక మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో మూసీ ప్రక్షాళనకు ప్రయత్నించారని గుర్తు చేశారు. 17 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా మూసీ రివర్ బెడ్ మీద 30 లక్షల స్వేర్ ఫీట్ల నిర్మాణం చేయాలని భావించారని, కానీ దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనుమతి ఇవ్వలేదని, కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ సర్కార్ కు ఫేజ్-1 లోనే 18 లక్షల స్వేర్ ఫీట్ల నిర్మాణానికి ఎలా అనుమతిచ్చారని మండిపడ్డారు. అసలు మూసీకి 16 నాలాల నుంచి మురుగు నీళ్లు వస్తున్నాయని, వాటిని ఏ విధంగా రాకుండా చేస్తారో చెప్పలేదని వాపోయారు. వాటిని క్లీన్ చేయకుండా నాలుగు ఎస్టీపీలు కడితే ఏం లాభమని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ నుంచి కాకుండా కొండపోచమ్మ సాగర్ నుంచి మూసీకి నీళ్లు తీసుకొస్తామని అందుకోసం 7 వేల కోట్లు ఖర్చు చేసే పనిచేస్తున్నారని, ఈ మొత్తం ఖర్చులను అసలు ఫేజ్-1 ప్రాజెక్ట్ లో భాగంగా చూపించలేదని గుర్తు చేశారు. జియాగూడలో మూసీ వద్ద పెద్ద ఎత్తున మేకల మండి ఉంటుందని, వ్యర్థాలు వేసే చోటు లేక మూసీలోకే వ్యర్థాలను వదులుతున్నారని, అక్కడ స్లాటర్ హౌస్ కట్టాలని తెలిపారు. అదే విధంగా మూసీ చుట్టూ వ్యర్థాలు క్లీన్ చేసేందుకు జీహెచ్ఎంసీ సిబ్బందిని పెంచాలని, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, అసలు మూసీలోకి మురుగు నీరు రాకుండా, అదే విధంగా ఆక్రమణలు జరగకుండా ముందు చర్యలు చేపట్టాలన్నారు. సిటీకి సంబంధించిన అంశం కావటంతో నా సిటిని కాపాడుకునేందుకు నేను మాట్లాడుతున్నాని, మూసీ ప్రక్షాళన మంచి విధానంలో జరగాలని, దాని ద్వారా ప్రజలకు మేలు జరగాలని కవిత కోరారు. అదే విధంగా అవసరానికి మించి సేకరణ చేసి పేదల ఇళ్లు కూల్చవద్దని, పేదళ్ల భూములు లాక్కొని పెద్ద వాళ్లకు ఇచ్చే రియల్ ఎస్టేట్ ఏజెంట్ లా ఈ ప్రభుత్వం మారిందని, వెలుగుమట్లలో 750 ఇళ్లు కూల్చితే నేను, విశారదన్ నిరాహార దీక్ష చేశామని, దీంతో ప్రభుత్వం దిగి వచ్చి 350 మందికి పట్టాలు ఇస్తామని చెప్పిందన్నారు. కానీ వారిలో కూడా సగం మంది కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నట్లు తెలిసిందని, బయట వంద మందికి ఇస్తామన్న ఇళ్ల విషయంలోనూ గందరగోళం ఉందని, దీనిపై ఈ నెల 17 ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేస్తామని, అక్కడున్న 31 ఎకరాలు భూదాన్ ల్యాండ్, పక్కన మరో 30 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో పెద్దవాళ్లకు వెళ్లనిచ్చేది లేదు. ఎంతవరకైనా వెళ్లి కొట్లాడుతామని అన్నారు. వెలుగుమట్ల బాధితులకు విశారదన్ తో పాటు జాగృతి అండగా ఉంటుందని కవిత పేర్కొన్నారు.
