. . . రైతుల ఆవేదనకు బాధ్యత ఎవరు ?
నందిపేట్, బతుకమ్మ :
నందిపేట్ మండల కేంద్రంలో రైతుల ఆవేదన రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే పది రోజులుగా కొనుగోలు కేంద్రాల ముందు ధాన్యాన్ని ఆరబెడుతూ ఎదురు చూస్తున్న రైతులు, ఇప్పుడు మరో కీలక సమస్యను లేవనెత్తుతున్నారు. సన్న రకాల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తూ, దొడ్డు రకాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి దొడ్డు వడ్లు పండించాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిరోజూ మీడియా ముందుకు వచ్చి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇస్తున్నప్పటికీ, గ్రౌండ్ లెవెల్లో మాత్రం అమలు పూర్తిగా శూన్యంగా ఉందని రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద పర్మిషన్లు లేవు, లారీలు అందుబాటులో లేవు అనే కారణంతో దొడ్డు రకాల ధాన్యాన్ని తిరస్కరించడం రైతుల పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తోందన్నారు. ఇప్పటికే అప్పులు చేసి పంట పండించిన రైతులు, ఇప్పుడు అమ్మకాలు లేక ఆర్థికంగా కుంగిపోతున్నారు. పండించమంటే పండిస్తాం, కానీ పండించిన పంటను కొనకపోతే మా బతుకు ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంకా కొద్ది రోజులు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత విషమిస్తుందని, వడ్లు కొనకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలాసార్లు అధికారులకు ఫోన్ల ద్వారా సమాచారం అందించిన అధికారుల్లో ఎలాంటి స్పందన లేకపోవడం రైతుల పట్ల చులకన భావానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేకపోతే మా పరిస్థితి దారుణంగా మారుతుంది అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. జీవనోపాధి కుదేలవుతున్న నేపథ్యంలో తీవ్ర నిరాశలో ఉన్నామని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని, దొడ్డు రకాల ధాన్య కొనుగోళ్లపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, రైతుల కష్టానికి న్యాయం చేయాలని స్థానికులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.