- నుడా అనుమతి లేదని కొరడా
- కూల్చివేసిన నుడా అధికారులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి బోధన్ వెళ్లే రహదారిలో వెలిసిన వెంచర్ కు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో నుడా అధికారులు కొరడా ఝళిపించారు. 8 ఎకరాల్లో ఏర్పాటు చేసిన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో మంగళవారం నుడా టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రహారితో పాటు డివైడర్లను, హద్దురాళ్ళను తొలగించారు. బోధన్ రోడ్డులో నిజామాబాద్ నగర శివారులోని నెహ్రూనగర్ వద్ద ఏర్పాటు చేసిన వెంచర్ లో అక్రమాలు జరిగాయని స్థానికులు గత వారం నుడా చైర్మన్ తో పాటు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో నుడా టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి సంబంధిత వెంచర్ కు సంబంధించిన పత్రాలను సమర్పించాలని ఆదేశించారు. అయితే వారం రోజులు గడువు ఇచ్చినప్పటీకీ వెంచర్ నిర్వాహకులు స్పందించకపోవడంతో పోలీసు బందోబస్తు మధ్య మంగళవారం ఉదయం వెంచర్ లోని నిర్మాణాలను కూల్చివేశారు.

బోధన్ రోడ్డులోని రహదారి 63పై 8 ఎకరాల్లో కొందరు వ్యక్తులు వెంచర్ నిర్మాణం చేపట్టారు. గత కొన్ని రోజులుగా అక్కడ వ్యవసాయ భూముల్లో వెంచర్ ను ఏర్పాటు చేసి విక్రయాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెంచర్ కోసం స్థానికంగా గ్రామస్తులకు సంబంధించిన ఒక వర్గానికి చెందిన స్మశాన వాటిక రోడ్డును కబ్జా చేశారనేది ప్రధాన ఆరోపణ. రికార్డుల ప్రకారం సంబంధిత పట్టాదారులకు ఆ సర్వే నంబర్ లలో 7.12 ఎకరాల భూమి ఉండగా 8 ఎకరాల్లో వెంచర్ చేయడం అనుమానాలకు తావిచ్చింది. వెంచర్ లో హైటెన్షన్ వైర్లు స్తంబాలు ఉండడంతో అక్కడ రోడ్లను వేసి చుట్టు ప్రక్కల ప్లాట్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా నెహ్రూనగర్ కు చెందిన గ్రామస్తుడి 25 గుంటల భూమిని చెరబట్టినట్లు బాధితుడు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో నుడా అధికారులు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జాతీయ రహదారి 63ను ఆనుకుని రోడ్డుపై ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేస్తున్న నుడా అధికారులకు అనుమతి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కొందరు బిల్డర్లు వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడ వెంచర్ ఏర్పాటుకు సంకల్పించినట్లు అందులో భాగంగానే అక్కడ భూములను కబ్జా తెరలేపి వెంచర్ చేస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత భూమిలో వెంచర్ ఏర్పాటు చేస్తుండగా నుడా, నీటి పారుదల శాఖ, రెవెన్యూ, పంచాయితీ రాజ్ శాఖలకు సంబంధించిన అనుమతులు తీసుకోకుండానే గత 4 నెలలుగా పనులు జరుగుతుంటే అటు వైపు అధికారులు వెళ్లకపోవడంపై ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా బిల్డర్ల మధ్య ఉన్న ఒక డెవలపర్ డెవలప్ చేస్తానని తీసుకున్న వ్యక్తి అందరినీ మేనేజ్ చేస్తానని చెబుతూ రూ.20 లక్షల వరకు మామూళ్ళు ఇచ్చానని , వెంచర్ కు ఏమి కాదని నమ్మించి బ్రోచర్లను ఏర్పాటు చేసి ప్లాట్ల విక్రయాలకు తెర లేపాడు. స్థానికంగా ఏజంట్లను నియమించుకుని ప్లాట్ల విక్రయాలను చేపట్టగా చివరకు బాధితుల ఫిర్యాదు మేరకు నుడా అధికారులు అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్ ను తొలగించడంతో తాత్కాలికంగా పనులు నిలిచిపోయాయి.
