Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 6:26 pm Posted by : ramakrishna

ఎఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా వేల్పూర్ భూమయ్య, దేశేట్టి సాయారెడ్డి

 

. . . 11వ మహా సభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పలు తీర్మానాలు

 

మోపాల్, బతుకమ్మ :

 

అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా 11 వ మహా సభ నిర్వహించారు. మోపాల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఈ మహా సభలో 21 మందితో కూడిన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. దీంట్లో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడిగా వేల్పూర్ భూమయ్య, ప్రధాన కార్యదర్శి గా దేశెట్టి సాయ రెడ్డి లను ఎన్నుకున్నారు. అలాగే మిగిలిన వారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మహాసభలో రైతు – రైతు కూలీల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ పలు తీర్మాలను ఆమోదించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ నిజాంసాగర్ ప్రాజెక్టు,  శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూడిక చేరినందున వాటిలో నీటి నిలువల సామర్థ్యం తగ్గిందని, గత సంవత్సరం ఏప్రిల్ లో ఈ జిల్లాలో జరిపిన తెలంగాణ ప్రాంతీయ రైతు దినోత్సవ సభలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులో చేరిన పూడికను తీయిస్తామని, ఈ ప్రాంత రైతులకు బలమైన హామీ ఇచ్చారన్నారు. ఏడాది గడిచిపోయిన ఆ పనులు చేపట్టకపోవడం విచారకరమని, ఇప్పటికైనా ఈ ప్రాజెక్టులోని పూడిక తీయాలని తీర్మానించారు. ఆగిపోయిన మంచిప్ప 21 ప్యాకేజీ పనులకు గాను తగిన నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని ఏడు మండలాలలోని 77 గ్రామాలలో 84 వేల ఎకరాలకు నీళ్లు అందించాలని తీర్మానించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మద్దతు ధరలు నామమాత్రంగా పెంచి చేతులు దులుపుకుందని, వరికి రూ.72 పెంచి రైతు పొలాలకు వాడే కాంప్లెక్స్ ధరలను రూ.300 నుండి రూ.400 కు పెంచడం మూలంగా పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చి రైతు నడ్డి విరచడమే అవుతుందని, ఈ ధరల పెంపును పున సమీక్షించి డాక్టర్ సామినాధన్ కమిషన్ సూచనల వెలుగులో రైతు పెట్టుబడులు 50 శాతం కలిపి మద్దతు ధరలు ఇవ్వాలని తీర్మానించారు. వరి మొక్కజొన్న పంటలు కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుందని, తీవ్రమైన ఎండలకు రైతులు ధాన్యం కుప్పల వద్ద అవస్థలకు, అస్వస్థతకు గురై అనారోగ్యం పాలు అవుతున్నారని, కొన్ని ప్రాంతాలలో ఆసుపత్రులలో చేరారని, యుద్ధ ప్రాతిపదికన కొనుగోలులో వేగం పెంచి పూర్తి చేయాలన్నారు. తెలంగాణ విత్తనాబి సంస్థకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 450 కోట్ల బకాయిలను చెల్లించి రైతులకు సరిపడా అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు అందించాలని ఎర్ర జొన్న విత్తనాలు ఈ సంస్థ ద్వారానే సప్లై చేసి బైబ్యాక్ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో తీసుకువచ్చిన జి రాంజీ చట్టాన్ని రద్దు పరచి పాత చట్టాన్ని అమలు పరచాలని తీర్మానించారు. ఈ మహా సభలో రైతు – రైతు కూలీలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.