. . . సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ :
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితులు, సిద్ధాంతులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఈ నెల 10వ తేదీన నాగార్జునసాగర్‌లో ఈ యాగం నిర్వహించనున్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో వరుణ యాగం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేదపండితులు నిర్ణయించిన ముహూర్తంలో యాగ క్రతువులను నిర్వహించనున్నారు. కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళతో కళకళలాడాలని, రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని సంకల్పిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వరుణ యాగం జరగనుంది. యాగం అనంతరం నిర్వహించే మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు, ప్రజలకు మేలు కలగాలని ప్రార్థిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.