Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 January 2026, 8:31 pm Posted by : ramakrishna

స్వాతంత్ర పోరాటంలో వడ్డె ఓబన్న  ధైర్య సాహసాలు అసమాన్యమైనవి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

స్వాతంత్య్ర పోరాటంలో వడ్డె ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని , ఆ మహనీయుని జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని వక్తలు అన్నారు. వడ్డె ఓబన్న జయంతి పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని సమావేశ మందిరంలో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వడ్డె ఓబన్న చిత్రపటానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఆయా సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్య్ర  సమరయోధుడు వడ్డె ఓబన్న అని కొనియాడారు. రేనాడు ప్రాంతంలో జన్మించిన ఓబన్న ఆనాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన సాయుధ పోరులో  సైన్యాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. వడ్డె ఓబన్న ఆశయాల సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీ.సీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, ఆర్టీఏ సభ్యులు నరేందర్ గౌడ్, ఆయా సంఘాల ప్రతినిధులు దండి వెంకట్, పి.వెంకటేష్, రాము, శంకర్, నరాల సుధాకర్, బంగారు సాయిలు, ఎం.రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.